మీ మొబైల్ ఫోన్ పోయినప్పుడు వ్యక్తిగత సమాచారం, విలువైన డాక్యుమెంట్లు కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. అందుకే మీ ఫోన్ పోయినప్పుడు మీరు తీసుకోవలసిన 5 జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఫోన్ సిమ్ లాక్ చేయాలి: ఫోన్ పోయిన వెంటనే ఫోన్ చిప్ ను క్యాన్సిల్ చేయమని ఆపరేటర్‌కు చెప్పాలి. దాంతో, మీరు పోగొట్టుకున్న ఆ సెల్ ఫోన్ వేరేవాళ్లు వాడేందుకు పనికిరాదు. ఆపరేటర్ వివరాలు సదరు సంస్థల వెబ్ సైట్ లలో లభిస్తాయి. దీనికి మీ ఫోన్ ఐఎమ్‌ఈఐ (ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ) తెలిసుండాలి. ఐఎమ్ఈఐ కోడ్ ఫోన్ డివైస్ బాక్స్ లేదా సెల్ ఫోన్‌పై ఉంటుంది. ఐఎమ్ఈఐ తెలుసుకోవాలంటే ఫోన్ డయల్ ప్యాడ్ లో *#06# డయల్ చేయాలి.
2. యాప్ పాస్ వర్డ్ మార్చాలి: సెల్ ఫోన్‌లో ఉన్న అన్ని యాప్ ల పాస్‌వర్డ్‌లన్నిటినీ మార్చాలి. పాస్‌వర్డ్‌లు మార్చకపోతే నేరస్థులు సులభంగా వ్యక్తిగత సమాచారాన్ని, కుటుంబ వివరాలను సేకరించే ప్రమాదం ఉంటుంది.
3. బ్యాంకులు, ఆర్ధిక సంస్థలకు సమాచారం ఇవ్వాలి: మీకు ఖాతాలున్న బ్యాంకుకు, ఇతర ఆర్ధిక సంస్థలకు వెంటనే ఫిర్యాదు చేయాలి. దీని వల్ల మీ మొబైల్ ఫోన్‌లో డౌన్ లోడ్ చేసిన బ్యాంకింగ్ యాప్ ను బ్లాక్ చేసే వీలుంటుంది. థర్డ్ పార్టీ అకౌంట్ల నుంచి డబ్బులు బదిలీ చేయకుండా నిరోధించడం సాధ్యమవుతుంది.
4. కుటుంబ సభ్యులు, స్నేహితులకు వెంటనే సమాచారమివ్వాలి: కుటుంబ సభ్యులు, స్నేహితులకు ఫోన్ పోయిన విషయాన్ని వెంటనే తెలియచేయాలి. ఫోన్ దొంగలించిన వ్యక్తులు మీ బంధువులు, స్నేహితుల వివరాలను సేకరించి వారిని మోసం చేసే ప్రయత్నం చేస్తారు. వారిని డబ్బు లేదా బ్యాంకు వివరాలు అడగడం లాంటివి చేసే అవకాశం ఉంది.
5. పోలీసులకు ఫిర్యాదు చేయాలి: ఫోన్ చోరీకి గురైన విషయాన్ని పోలీసులకు తెలియచేసి ఫిర్యాదు నమోదు చేయాలి. ఫిర్యాదు కాపీని బ్యాంకుకు, ఇన్సూరెన్సు అధికారులకు లేదా ఇతర సంస్థలకు సమర్పించాల్సి ఉంటుంది. ఫిర్యాదు చేయడం వల్ల పోలీసులు కేసు దర్యాప్తు చేస్తారు.