స్పైస్‌జెట్ విమాన సేవలకు బుధవారం అంతరాయం కలిగింది. గుర్తు తెలియని సైబర్ నేరగాళ్లు రాన్‌సమ్‌వేర్ దాడి చేశారు. దీంతో ఉదయం కాస్త ఆలస్యంగా విమానాలు బయలు దేరాయి. పరిస్థితి చక్కబడిందని, ప్రస్తుతం విమానాలు యథావిధిగా నడుస్తున్నాయని స్పైస్ జెట్ సంస్థ తెలిపింది. కొన్ని స్పైస్‌జెట్ సిస్టమ్‌లు గత రాత్రి రాన్‌సమ్‌వేర్ దాడి ఎదుర్కొన్నాయని ప్రకటించింది. దీంతో విమాన సేవలపై స్వల్ప ప్రభావం చూపిందని పేర్కొంది. తమ ఐటీ బృందం పరిస్థితిని సరిదిద్దినట్లు తెలిపింది.
ఈ దేశీయ విమానయాన సంస్థ 91 విమానాల సముదాయాన్ని కలిగి ఉంది. వాటిలో 13 భారీ విమానాలు, 46 విమానాలు బోయింగ్ 737 విమానాల పాత వెర్షన్లు. స్పైస్‌జెట్ సీఎండీ అజయ్ సింగ్ ఎయిర్‌లైన్స్ 17వ వార్షికోత్సవం సందర్భంగా తన ఉద్యోగులకు పంపిన ఇమెయిల్‌లో, విమానంలో బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సేవలను ప్రారంభించాలని భావిస్తున్నట్లు తెలిపారు. త్వరలో తమ విమానంలో బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సేవను ప్రారంభించాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఓ వైపు సంస్థను టెక్నాలజీ పరంగా అభివృద్ధి చేయాలనుకుంటున్న తరుణంలో సైబర్ దాడి జరగడంతో సంస్థ ఐటీ విభాగం అప్రమత్తమైంది.