అత్యంత అరుదుగా నిర్వహించే లక్ష వత్తుల నోము కొయ్యలగూడెం లోని కాణ్వ విద్యాపీఠంలో శనివారం ఘనంగా నిర్వహించారు. 27వ తేదీన పీఠాధిపతి బ్రహ్మశ్రీ అని పెద్ది వెంకట నరసింహ శర్మ ఆధ్వర్యంలో ప్రారంభించగా 28వ తేదీ సాయంత్రం తో ముగిసింది. 48 గంటల పాటు నిర్విరామంగా నిర్వహించిన హోమంలో పురోహిత కుటుంబాలవారు, బ్రాహ్మణ సమాఖ్య వారు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కొయ్యలగూడెం, కన్నాపురం, సరిపల్లి గ్రామ పురోహితులైన మూడు వంశాలకు చెందిన ముత్తయిదువులు లక్ష వత్తుల నోము ఆచరించారు. దీనివల్ల బ్రాహ్మణ మహిళలలో రజో దోషాలు నివృత్తి అయ్యి గాయత్రి మాత సమానులు అవుతారని స్వర్గీయ మల్లాది చంద్రశేఖర శాస్త్రి శిష్యులు గర్భముళ్ళ వీరయ్య తెలిపారు. నిర్విరామంగా 27వ తేదీ సాయంత్రం మొదలుకొని శనివారం తెల్లవారుజాము వరకు ఆయన 1, 175 కథలను వినిపించారు. ప్రారంభ రోజున గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహించామని రెండవ రోజు పంచగవ్య ప్రాసన నిర్వహించినట్లు పేర్కొన్నారు. బ్రాహ్మణులు విశేషంగా భావించే ఈ క్రతువులో పాల్గొనడానికి వివిధ ప్రాంతాల నుంచి బ్రాహ్మణ ప్రముఖులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. అని పెద్ది పరదేశీ వరప్రసాద్, అని పెద్ది వెంకట సుబ్రహ్మణ్య శర్మ, అని పెద్ది రామ గణపతి శర్మ, అనిపెద్ది నరసింహశర్మ, పీఠం లోని శిష్య పురోహితులు ఆధ్వర్యంలో పూజలు చేసి వేద ఆశీర్వచనాలు నిర్వహించారు. అనంతరం అన్న సమారాధన నిర్వహించారు.