ఏపీలో వరుసగా పరీక్షల ఫలితాలు వస్తున్నాయి. ఇదివరకే రాష్ట్రంలో టెన్త్ క్లాస్, ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్స్ ఫలితాలు విడదలయ్యాయి. నేడు ఆంధ్రప్రదేశ్ ఈఏపీసెట్ ఫలితాలు ప్రకటించారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల చేశారు. జూలై 26న ఉదయం 11 గంటలకు విజయవాడ లో మంత్రి బొత్స చేతుల మీదుగా ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలు అధికారిక వెబ్ సైట్ https://cets.apsche.ap.gov.in లో చెక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
ఈ ఏడాది ఈఏపీసెట్ 2 లక్షల 82 వేల 496 మంది పరీక్ష రాయగా, 2 లక్షల 56 వేల 983 మంది క్వాలిఫై అయ్యారని మంత్రి బొత్స తెలిపారు. ఇంజినీరింగ్ లో 89.12 శాతం క్వాలిఫై అయ్యారు. ఫార్మసీ, అగ్రికల్చర్ విభాగంలో 87 వేల 744 మంది పరీక్షకు హాజరుకాగా 83 వేల 411 మంది క్వాలిఫై అయ్యారు. 95.06 శాతం అభ్యర్థులు అగ్రికల్చర్ విభాగంలో అర్హత సాధించినట్లు చెప్పారు. ఇంజినీరింగ్ విభాగంలో 1 లక్షా 48 వేల 283 సీట్లు ఉన్నాయని వెల్లడించారు. ఇంజినీరింగ్ విభాగంలో 2 లక్షల 6 వేల 579 మంది దరఖాస్తు చేసుకోగా, 1 లక్షా 94 వేల 752 మంది పరీక్ష రాయగా 1 లక్షా 73 వేల 572 మంది క్వాలిఫై అయ్యారని మంత్రి బొత్స తెలిపారు.