ఈ రోజుల్లో ఉపాధి అవకాశాల కోసం మనం దేశ, విదేశాలకు వెళ్తున్నాం. ఈ తరుణంలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఒక కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా కంపెనీ టైర్ 2, టైర్ 3 పట్టణాల్లో 12వ తరగతి పాస్ అయిన విద్యార్థులకు ట్రైనింగ్ ఇచ్చి ఉపాధి కల్పిస్తోంది. వీళ్లను ప్రోగ్రామర్లుగా తీర్చిదిద్దుతోంది. ఇంటర్నల్ ప్రాజెక్టుల్లో ఉద్యోగాలు అందిస్తోంది. గత ఏడాది హెచ్‌సీఎల్ 4 వేల మంది ఇంటర్ పాస్ అయిన వారిని ప్రోగ్రామ్‌లోకి తీసుకుంది. ఈ ఏడాది ఈ సంఖ్య 8 వేలకు చేరింది. అలాగే వచ్చే ఏడాది 15 వేల మంది లక్ష్యంగా కంపెనీ ముందుకు వెళుతోంది.
హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ హెచ్ఆర్ హెడ్ వీవీ అప్పారావు మాట్లాడుతూ.. చాలా మంది ప్రోగ్రామ్‌లో ట్రైనింగ్ తర్వాత లోయెండ్ వర్క్‌లో ప్లేస్‌మెంట్ ఇస్తారని అనుకుంటూ ఉంటారు అని తెలిపారు. కానీ ఇప్పుడు ప్రోగ్రామ్ పూర్తి చేసి వచ్చిన వారు క్లౌడ్ ఇంజినీర్స్, డిజిటల్ ఇంజినీర్స్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. కంపెనీ అందిస్తున్ ప్రోగ్రామ్ పేరు టెక్‌బీ. ఇందులో క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఉంటుంది. అలాగే ఆన్ ద జాబ్ ట్రైనింగ్ ఇస్తారు. ఆరు నెలల పాటు శిక్షణ ఉంటుంది.
ఈ ట్రైనింగ్ తర్వాత ప్రాజెక్టుల్లో వీరిని భాగస్వామ్యం చేస్తారు. తర్వాత విద్యార్థులు బిట్స్ పిలాని, సస్త్ర, సింబయాసిస్, అమిటీ, ఐఐఎం నాగ్‌పూర్ వంటి ఇన్‌స్టిట్యూట్లలో గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ పూర్తి చేయొచ్చు. వీటితో హెచ్‌సీఎల్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. క్లాసులు వీకెండ్‌లో ఉంటాయి. హెచ్‌సీఎల్ కంపెనీ ఆన్ ద జాబ్ ట్రైనింగ్‌లో వీరికి నెలకు రూ. 10 వేలు అందిస్తుంది. తొలి ఏడాదిరూ. 2.5 లక్షల వార్షిక వేతనం వస్తుంది. తర్వాత వేతనం పెరుగుతుంది. రెండో ఏడాదిలో రూ. 3.5 లక్షలు చెల్లిస్తారు. ఇంకా గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్‌కు కంపెనీయే డబ్బులు చెల్లిస్తుంది. అయితే ఇక్కడ ఒక అగ్రిమెంట్ ఉంటుంది. గ్రాడ్యుయేషన్ పూర్తి అయిన తర్వాత హెచ్‌సీఎల్ కంపెనీలో రెండేళ్లు పని చేయాల్సి ఉంటుంది.
విద్యార్థులను అప్టిట్యూడ్ టెస్ట్ ద్వారా ప్రోగ్రామ్ కోసం ఎంపిక చేస్తారు. ఇంగ్లీష్, మ్యాథ్స్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. అయితే ఇక్కడ స్టూడెంట్స్ ప్రోగ్రామ్ కోసం రూ.లక్ష చెల్లించాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఖర్చును అవే భరిస్తున్నాయి. పూర్తిగా లేదంటే పాక్షికంగా ఈ డబ్బులు చెల్లిస్తున్నాయి. అందువల్ల ఇంటర్ పూర్తియిన తర్వాత జాబ్ పొందాలని భావించే వారు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు.