నిజాలతో మాట్లాడే కేటీఆర్ యువతకు కనెక్ట్ అయ్యారు
విజ్ఞాన్ రత్తయ్య వ్యాఖ్యలు
హైదరాబాద్: ఇంజనీరింగ్ విద్యార్థులపై ప్రభుత్వంలో ఉన్న కొందరు వ్యక్తులు చేస్తున్న వ్యాఖ్యలపై విజ్ఞాన్ విద్యాసంస్థల వ్యవస్థాపక ఛైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. "ఇంజనీరింగ్ విద్యార్థులు పనికిరారు" అని వ్యాఖ్యానించేవారికి కనీస విచక్షణ, బ్రెయిన్ లేవని ఆయన ఘాటుగా విమర్శించారు.
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎల్లప్పుడూ గణాంకాలు (డేటా), స్పష్టమైన ఆధారాలతో మాట్లాడుతారని, అందుకే ఆయన యువతకు బాగా కనెక్ట్ అయ్యారని రత్తయ్య పేర్కొన్నారు. ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనతో పాటు తమిళనాడు ఎన్నికల్లోనూ యువత శక్తి ఏంటో దేశమంతా చూసిందని గుర్తుచేశారు.
జంతర్ మంతర్ వద్ద పోలీసులు లాఠీఛార్జ్ చేసినప్పటికీ, వెనక్కి తగ్గకుండా నిరసనకారులు ధైర్యంగా నిలబడ్డారని తెలిపారు. స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో చూసిన పోరాట పటిమ మళ్లీ అక్కడ కనిపించిందన్నారు. భవిష్యత్ ఎన్నికల్లో నాయకులు నోటికొచ్చినట్లు మాట్లాడితే చెల్లుబాటు కాదని హెచ్చరించారు. ఖచ్చితమైన ఆధారాలు, డేటా ఆధారంగా మాట్లాడే నాయకులకే యువత తమ ఓటు ద్వారా పట్టంగడతారని స్పష్టం చేశారు.
