వరంగల్‌లో పోలీస్ v/s పోలీస్

Select Suryaa Now

వరంగల్: మద్యం మత్తులో ఓ బెటాలియన్ కానిస్టేబుల్ సృష్టించిన రచ్చ, ఆ తర్వాత జరిగిన ఘర్షణ వరంగల్ పట్టణంలో తీవ్ర కలకలం రేపింది. విధి నిర్వహణలో ఉండాల్సిన కానిస్టేబుళ్లు పరస్పరం దాడులు చేసుకోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

వరంగల్ జిల్లా ఉర్సు గుట్ట ప్రాంతంలోని ఓ బార్‌లో ఓ బెటాలియన్ కానిస్టేబుల్ తీవ్రంగా మద్యం సేవించి తీవ్ర రగడ సృష్టించాడు. షర్ట్ విప్పేసి బార్‌లో ఉన్న ఇతరులతో గొడవ పడుతూ న్యూసెన్స్ చేయడంతో, కలవరపడిన బార్ సిబ్బంది వెంటనే 'డయల్ 112'కు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న బీట్ కానిస్టేబుల్ సంతోష్ రెడ్డి.. మత్తులో ఉన్న బెటాలియన్ కానిస్టేబుల్‌ను శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. షర్ట్ వేసుకుని వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరిస్తూ, చెంప దెబ్బ కొట్టారు.

తనపై చెయ్యి చేసుకోవడంతో ఆగ్రహానికి గురైన బెటాలియన్ కానిస్టేబుల్, ప్రతిగా బీట్ కానిస్టేబుల్ సంతోష్ రెడ్డి చెంప చెళ్లుమనిపించాడు. దీంతో సహనం కోల్పోయిన సంతోష్ రెడ్డి తన చేతిలో ఉన్న లాఠీతో బెటాలియన్ కానిస్టేబుల్‌ను చితకబాదారు. అక్కడ ఉన్న స్థానికులు, బార్ సిబ్బంది కూడా బీట్ కానిస్టేబుల్‌కు మద్దతుగా సదరు బెటాలియన్ కానిస్టేబుల్‌పై దాడి చేశారు.

రక్షణ కల్పించాల్సిన పోలీసులే ఇలా బహిరంగంగా కొట్టుకోవడం చూసి బార్ వద్ద ఉన్నవారు నిర్ఘాంతపోయారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది.