ఐటీ, విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం, విద్యుత్, పర్యాటక, చేనేత, వస్త్ర పరిశ్రమ, సముద్రయానం తదితర రంగాలతో పాటు పెట్టుబడులకు అవకాశాలున్న అన్ని రంగాల శాఖల అధికారులు, ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు–2023 ను విజయవంతం చేయాలని మంత్రి గుడివాడ అమర్నాధ్ చెప్పారు. ప్రస్తుతం ఉన్న జాతీయ, అంతర్జాతీయ కంపెనీల విస్తరణపై దృష్టి సారించాలన్నారు.
సదస్సుకు ప్రత్యేక అంబాసిడర్ అవసరంలేదని, అపాచీ, కియా, హీరో, బ్రాండిక్స్ తదితర కంపెనీల ప్రతినిధులనే పరిశ్రమల ప్రమోటర్లుగా వినియోగించుకోవాలన్నారు. వారి అభిప్రాయాలతో ఆడియో, వీడియోలు రూపొందించి వాటితో విస్తృత ప్రచారం చేయాలన్నారు. సదస్సు లక్ష్యాలు, ప్రయోజనాలు ప్రతిబింబించేలా అనుభవజ్ఞులైన కన్సల్టెంట్ ద్వారా లోగో, థీమ్ రూపొందించాలని ఆదేశించారు.