ఆసియా కప్-2022 టోర్నీకి ముందు టీమిండియాకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా, మరో ఫాస్ట్‌బౌలర్ హర్షల్ పటేల్ గాయం కారణంగా ఈ మెగా ఈవెంట్‌కు దూరమైన విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం టీమిండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ సైతం జట్టుకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. టీమిండియా జింబాబ్వే పర్యటన నేపథ్యంలో ద్రవిడ్‌కు బీసీసీఐ విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో టీమిండియా దిగ్గజ బ్యాటర్, జాతీయ క్రికెట్ అకాడమీ చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ ఈ వన్డే సిరీస్‌లో భారత జట్టుకు కోచ్‌గా వ్యవహరించాడు. ఆసియా కప్ టోర్నీ ఆరంభానికి ముందు తక్కువ సమయం ఉండటంతో ఈ మేరకు ద్రవిడ్‌కు రెస్ట్ ఇచ్చినట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపారు. అయితే, రాహుల్ ద్రవిడ్ కరోనా బారిన పడినట్లు తాజాగా వార్తలు వెలువడుతున్నాయి. యూఏఈకి బయల్దేరే ముందు కోవిడ్ పాజిటివ్‌గా నిర్దారణ అయిన కారణంగా హెడ్‌కోచ్ ఈ మెగా టోర్నీకి దూరమయ్యే అవకాశాలు ఉన్నాయని జాతీయ మీడియా తన కథనంలో పేర్కొంది.
ఇక ద్రవిడ్ గైర్హాజరీ నేపథ్యంలో లక్ష్మణ్ మరోసారి టీమిండియా కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నట్లు తెలుస్తోంది. కాగా జింబాబ్వే టూర్‌లో కేఎల్ రాహుల్ సారథ్యంలోని భారత జట్టు వన్డే సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. నామమాత్రపు ఆఖరి వన్డేలో ఆతిథ్య జింబాబ్వే గట్టిగానే ప్రతిఘటించినా ఆఖరికి 13 పరుగుల తేడాతో విజయం టీమిండియా సొంతమైంది. దీంతో కెప్టెన్‌గా రాహుల్ ఖాతాలో గెలుపు నమోదైంది.
ఇక ఆగష్టు 27న యూఏఈ వేదికగా ఆసియా కప్ మొదలు కానుండగా ఆ మరుసటి రోజు భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో టోర్నీలో తమ ప్రయాణాన్ని ఆరంభించనుంది. ఈ నేపథ్యంలో రాహుల్ ద్రవిడ్ కరోనా బారిన పడి దూరం కావడంతో జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లయింది.