టీమిండియా సీనియర్ ఆటగాడు శిఖర్ ధావన్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడంలో ఎప్పుడు ముందుంటాడు. మైదానంలో బరిలోకి దిగితే పరుగులు చేయడమే కాదు.. మైదానం బయట కూడా అంతే చలాకీగా ఉంటాడు. జింబాబ్వేతో మూడో వన్డే సందర్భంగా ధావన్ చర్య సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కాగా బ్యాటింగ్ సమయంలో ధావన్ తన జెర్సీ కాకుండా శార్దూల్ ఠాకూర్ జెర్సీ వేసుకొని రావడం విశేషం.అంతేకాదు జెర్సీపై శార్దూల్ పేరు కనబడకుండా దానిపై టేప్ అతికించాడు. దీనికి సంబంధించిన వీడియో కూడా చక్కర్లు కొట్టింది. అయితే ధావన్ ఔటై డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లాకా మరొక ఫన్నీ ఘటన చోటుచేసుకుంది. మ్యాచ్ చూడడానికి వచ్చిన ఒక అభిమాని.. ప్లకార్డు చేత బట్టుకొని శిఖర్.. ''మీ జెర్సీ నాకు ఇవ్వగలరా'' అని అడిగాడు.
దీంతో కెమెరాలన్ని ధావన్‌వైపు తిరిగాయి. అభిమాని చర్యకు సంతోషపడిన ధావన్.. తన షర్ట్ బయటికి తీసే ప్రయత్నం చేశాడు. పక్కనే ఉన్న ఆవేశ్ ఖాన్, కెప్టెన్ కేఎల్ రాహుల్‌లు నవ్వల్లో మునిగిపోయారు. అభిమానులు అడిగితే నేను ఏదైనా ఇవ్వడానికి సిద్ధమే అని చెప్పడం కోసమే ధావన్ ఇలా చేశాడని అభిమానులు పేర్కొన్నారు. ఇక 36 ఏళ్ల ధావన్ జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్‌లో 154 పరుగులు సాధించాడు.
ఇక చివరి వన్డేలో శిఖర్ ధావన్ 40 పరుగులు చేయగా.. మరో ఓపెనర్ శుబ్‌మన్ గిల్ డెబ్యూ సెంచరీతో మెరిశాడు. ఇషాన్ కిషన్ అర్థ సెంచరీతో మెరవడంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది. అనంతరం 290 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 49.3 ఓవర్లలో 276 పరుగులకు ఆలౌటైంది. జింబాబ్వే బ్యాటర్ సికందర్ రజా వీరోచిత సెంచరీ వృథా అయినప్పటికి.. తన ఇన్నింగ్స్‌తో అభిమానుల మనసు దోచుకున్నాడు.