ముందస్తు ఎన్నికలకు రాకుండా ఐదేళ్ల పాటు పాలించే దమ్ము మీ వైసీపీకి ఉందా అని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు నాగబాబు ప్రశ్నించారు. ఐదేళ్ల కంటే ముందే ఎన్నికలకు రాబోమని, షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళతామని మీ నాయకుడితో చెప్పించగలరా? ఆ విధంగా చెప్పే దమ్ము మీ నాయకుడికి ఉందా అని ఆయన ప్రశ్నించారు. ఇదిలావుంటే జనసేన పార్టీకి 175 సీట్లలో పోటీ చేసే దమ్ముందా? అంటూ మంత్రి జోగి రమేశ్, చంద్రబాబు దత్తపుత్రుడు అంటూ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. దీనిపై నాగబాబు ఘాటుగా స్పందించారు. వైసీపీలో ఉంటూ పవన్ కల్యాణ్ పై రకరకాలుగా వాగే కేతిగాళ్లకు, జుట్టు పోలిగాళ్లకు, అల్లాటప్పా గోంగూరమ్మలకు తాను రెండు చిన్న సవాళ్లు విసురుతున్నానని తెలిపారు.
"కేతిగాళ్లు, జుట్టు పోలిగాళ్లు, అల్లాటప్పా గోంగూరమ్మలు అన్నానని తప్పుగా భావించొద్దు. ఈ పాత్రలను మన కళారూపాల్లో ఒకటైన తోలుబొమ్మలాట నుంచి తీసుకున్నాను. వైసీపీలో ఉన్న చాలామంది ఎమ్మెల్యేలకు, మంత్రులకు, నేతలకు వెన్నెముకలు లేవు కాబట్టి ఆ పార్టీ తోలుబొమ్మలాట పార్టీయే కదా.... అందుకే అలా అన్నాను. అయితే, ఒకవేళ వైసీపీలో ఎవరైనా మంచి నాయకులు ఉంటే వారికి ఈ మాటలు వర్తించవు.
రెండో చాలెంజ్ ఏంటంటే... మీ నవరత్నాల థానోస్ రెడ్డికి దమ్ముంటే మా నాయకుడు పవన్ కల్యాణ్ తో చర్చకు రమ్మనండి చూద్దాం. మా పేరు పలకడం అతడికి ఇష్టం లేదు కాబట్టి, మేం కూడా అతడి పేరు పలకదలుచుకోలేదు. ఈ విషయం రెండు వైపులకు వర్తిస్తుంది. మేం ప్రతిపాదించిన ఓపెన్ డిబేట్ కు మీ థానోస్ రెడ్డి వస్తాడా? వైసీపీ పాలనపై జేఎస్పీ అధినేత పవన్ కల్యాణ్ తో చర్చిస్తాడా? ఈ చర్చకు మేం మా నాయకుడ్ని ఒపిస్తాం... మీరు మీ నాయకుడ్ని ఒప్పించగలరా?" అంటూ వైసీపీ నేతలకు నాగబాబు సవాల్ విసిరారు.