రాష్ట్రంలో ప్రజలు టీడీపీవైపు మొగ్గు చూపించారని.. ఆ పార్టీకి 90 సీట్లకు పైగా వస్తాయని సర్వే చెబుతోందని నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఎన్నికలపై ఓ యాప్ ద్వారా సర్వే చేయించానని చెప్పుకొచ్చారు. గోదావరి జిల్లాల్లో పవన్ కళ్యాణ్ ప్రభావం చాలా ఉందని.. కొన్ని ఛానల్స్ సర్వేలు నిజం అనుకుంటే పార్టీకి కష్టాలు తప్పవని పార్టీ అధిష్ఠానానికి సూచించారు. ఎన్నికలపై ఓ యాప్ ద్వారా సర్వే చేయించానని తెలిపారు.
రఘురామ చేసిన సర్వేలో చంద్రబాబు ప్రాతినిధ్య వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో టీడీపీకి 56శాతం, వైఎస్సార్‌సీపీకి 34శాతం అనుకూలంగా ఉందన్నారు. అలాగే లోకేష్ ప్రాతినిధ్య వహిస్తున్నమంగళగిరిలో 50శాతం టీడీపీ.. వైఎస్సార్‌సీపీకి 37శాతం అనుకూలంగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు. రాయలసీమలో ఆసక్తికరంగా ఫలితాలు ఉన్నాయని.. ముఖ్యమంత్రి సొంత జిల్లా కడపలో కూడా టీడీపీ హవా ఉందని తమ సర్వేలో తేలిందని చెప్పుకొచ్చారు. జిల్లాలవారీగా రిపోర్టు ఉందని చెప్పుకొచ్చారు.రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి పోటీ చేస్తే వార్ వన్ సైడేనని రఘురామ కృష్ణరాజు వ్యాఖ్యానించారు. తాను విస్తృత సాయి శాంపిల్స్ తో శాస్త్రీయంగా జూన్, జులై మొదటి వారం వరకు నిర్వహించిన సర్వేలో టీడీపీకి 90కిపైగా స్థానాలలో కచ్చితంగా విజయం సాధిస్తుందని తేలిందన్నారు. ఇక నువ్వా నేనా అన్నట్టు ఉన్న స్థానాలలో సగం స్థానాలో విజయం సాధించినా.. ఆ పార్టీకి 127 స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు.
వైఎస్సార్‌సీపీ కచ్చితంగా గెలిచే స్థానాలు కేవలం 7 నుంచి 8 కాగా.. మరో మూడు నుంచి నాలుగు స్థానాలలో విజయ అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఇక నువ్వా నేనా అన్నట్లు ఉన్న 65 స్థానాలలో తమ పార్టీ ఒకవేళ 90% స్థానాలలో విజయం సాధించిన 73 సీట్లకే పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. జిల్లాల వారీగా సర్వే పరిశీలిస్తే ప్రకాశం జిల్లాలో పోటాపోటీగా తెలుగుదేశం, వైఎస్సార్‌సీపీ తలపడే అవకాశం ఉందన్నారు. అనంతపురంలో తెలుగుదేశం పార్టీ మెజార్టీ స్థానాలలో ఏకపక్ష విజయం సాధించనుందని.. ఉభయగోదావరి జిల్లాలలో జనసేన ప్రభావం అధికంగా ఉందన్నారు. గుంటూరులోనూ విజయ అవకాశాలను పవన్ కళ్యాణ్ ప్రభావితం చేయగలరని చెప్పారు. టీడీపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తే నువ్వా నేనా అన్నట్లు పోటీ ఉన్న స్థానాలలో ఆ రెండు పార్టీల అభ్యర్థులు అవలీలగా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయన్నారు.
మరోవైపు పరామర్శకు వెళ్తున్న లోకేశ్‌ను అడ్డుకోవడం దారుణమని రఘురామ అన్నారు. చంద్రబాబు ఇలా వ్యవహరించి ఉంటే గతంలో ఒక్క ఊరైనా తిరిగేవాళ్లమా అంటూ ప్రశ్నించారు. ఉన్నట్టుండి ఢిల్లీకి వచ్చిన జగన్ ముఖచిత్రం సరిగా లేదని.. వైఎస్ వివేకా కేసు గురించి తెలుసుకోవడానికే వచ్చారని కొందరు అంటున్నారని.. వివేకా హత్య కేసులో దోషులు ఎవరో తేలాల్సి ఉందన్నారు.