కొత్తగా నిర్మిస్తున్న మెడికల్ కళాశాలలకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సహకారం కావాలని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని.. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ మన్సూక్ మాండవీయను కోరారు. న్యూఢిల్లీలోని నిర్మాణ్ భవన్‌లో ఉన్న కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రధాన కార్యాలయంలో బుధవారం ఆమె కేంద్రమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా మంత్రి విడదల రజిని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖకు సంబంధించి పలు విషయాలను చర్చించారు.
పలు అంశాలపై వినతి పత్రాలు అందించారు. ఆమె మాట్లాడుతూ పాడేరు, మచిలీపట్నం, పిడుగురాళ్లలో మెడికల్ కళాశాలల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చాయని, ఇప్పుడు ఈ మూడు చోట్ల కళాశాలల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని వివరించారు.
గతంలో ఏపీలో 13 జిల్లాలు ఉండేవని, జనాభా అత్యధికంగా పెరిగిపోయిన నేపథ్యంలో పరిపాలనా సౌలభ్యం కోసం ఇప్పుడు 26 జిల్లాలు ఏర్పాటయ్యాయని తెలిపారు. ప్రతి జిల్లాలోనూ కనీసం ఒక ప్రభుత్వ మెడికల్ కళాశాల ఉండేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చర్యలు తీసుకున్నారని చెప్పారు.