కృష్ణా జిల్లా పెడనలో వైఎస్సార్ నేతన్న నేస్తం నిధుల విడుదల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం జగన్ హాజరయ్యారు. వరుసగా నాలుగో ఏడాది నేతన్న నేస్తం పథకం కింద నేతన్నల ఖాతాల్లో నిధులు జమ చేశారు. ఒక్కొక్కరికి రూ.24 వేల చొప్పున మొత్తం రూ.193.31 కోట్లను విడుదల చేశారు. ఈ పథకం కింద 80,546 నేతన్నలకు లబ్ది చేకూరనుంది. వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం ద్వారా అర్హులై ఉండి సొంత మగ్గం కలిగిన ప్రతి చేనేత కుటుంబానికి ప్రభుత్వం ఆర్థికసాయం చేస్తుండడం తెలిసిందే.
కాగా, నేతన్న నేస్తం నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సీఎం జగన్ స్వయంగా మగ్గం నేయడం విశేషం. ఆయన మగ్గాన్ని, దాని పనితీరును తెలుసుకునేందుకు ఆసక్తి చూపించారు. మంత్రులు జోగి రమేశ్, రోజా కూడా ఈ సందర్భంగా సీఎం పక్కనే ఉన్నారు.