సీఎం సభలో సోమశిల మరణించిన మహిళకు రూ.10 లక్షల నష్టపరిహారం ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం కృష్ణా జిల్లా పెడనలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరైన సంగతి తెలిసిందే. ఈ సభా వేదిక మీద నుంచి నేతన్న నేస్తం కింద నిధులను ఆయన లబ్ధిదారుల ఖాతాల్లోకి విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో జనం హాజరు కాగా... సభలో ఓ అపశ్రుతి చోటుచేసుకుంది. సభలోనే సొమ్మసిల్లి పడిపోయిన మాణిక్యమ్మ అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.
ఈ విషయం తెలుసుకున్న మంత్రి జోగి రమేశ్... విషయాన్ని నేరుగా సీఎం జగన్‌కు వివరించారు. ఈ వార్త విన్నంతనే స్పందించిన జగన్ బాధిత మహిళ కుటుంబానికి రూ.10 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. అంతేకాకుండా బాధిత మహిళ కుటుంబానికి తక్షణమే పరిహారం అందజేయాలని ఆయన మంత్రి జోగి రమేశ్‌ను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో వేగంగా కదిలిన రమేశ్... రూ.10 లక్షల చెక్కును గురువారమే మాణిక్యమ్మ కుటుంబానికి అందజేశారు.