కార్మికుల ఐక్య పోరాటాలతోనే కేంద్ర ప్రభుత్వం దిగి వస్తుందని కార్పొరేటర్ కాకి గోవింద రెడ్డి, నిర్వాసిత నాయకుడు పులి రమణారెడ్డి అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ కూర్మన్నపాలెంలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారం నాటికి 560వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా వారు కార్మికులనుద్దేశించి మాట్లాడుతూ ప్రజల సంపదైన ప్రభుత్వ రంగాలను కార్పొరేట్‌లకు అప్పగించాలని యోచిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. ప్రభుత్వ రంగాల పరిరక్షణకు ప్రభుత్వాలు కట్టుబడి వుండాలని డిమాండ్ చేశారు.
విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ డి. ఆదినారాయణ మాట్లాడుతూ నేటి పాలకులు రాజ్యాంగ నియమ నిబంధనలను విస్మరిస్తున్నారన్నారు. రాజ్యాంగాన్ని ఉపయోగించి ప్రజలకు సంక్షేమ పాలనను అందించకుండా వ్యతిరేక పాలనకు పాల్పడుతున్నారని విమర్శించారు. స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకునేందుకు ఐక్య పోరాటాలను ఉధృతం చేయాలన్నారు. నాయకుడు వరసాల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
నాయకుడు పరంధామయ్య ఎంతోమంది ప్రాణ త్యాగాలతో ఏర్పడిన స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించకుండా సెయిల్‌లో గానీ ఎన్‌ఎండీసీలో కానీ విలీనం చేసే విధంగా పెద్దలు యోచించాలన్నారు. నాయకులు అప్పారావు, సన్యాసిరావు మాట్లాడుతూ ఉక్కు పరిరక్షణ కోసం అన్ని పార్టీలు చిత్తశుద్ధితో పనిచేయాలని, ప్రాణ త్యాగాలతో సాధించుకున్న ‘ఉక్కు’ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకునేది లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.