సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఈ రోజు పదవీ విరమణ చేయనున్నారు. ఇదే రోజున సుప్రీం కోర్టు చరిత్రలో విచారణ తీరును తొలి సారిగా ప్రత్యక్ష ప్రసారం చేసారు. సీజేఐ బెంచ్ విచారిస్తున్న కేసుల లైవ్ ప్రొసీడింగ్స్ ప్రారంభమయ్యాయి. న్యాయమూర్తిగా తన చివరి రోజు తీర్పులు..విచారణ లో భాగంగా సీజేఐ ఎన్వీ రమణ తదుపరి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యుయు లలిత్, జస్టిస్ హిమా కోహ్లీతో బెంచ్‌ను పంచుకున్నారు. ఈ త్రిసభ్య ధర్మాసనం విచారణలు జరుపుతోంది. తొలి కేసులో భాగంగా ఎన్నికల ఉచితాల పైన సీజేఐ బెంచ్ విచారించింది. దీని పైన ఇప్పటికే పలు విడతలు విచారణ చేసిన సీజేఐ బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది. దీని పైన రాజకీయ పార్టీలే ముందుకొచ్చి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు.
ఈ కేసును మరో బెంచ్ కు రిఫర్ చేస్తూ నిర్ణయం వెలువరించారు. దీంతో పాటుగా తొలి రోజున మొత్తం 30 కేసులు ఈ బెంచ్ విచారిస్తోది. 2014 ఫిబ్రవరి 17వ తేదీన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన ఎన్వీ రమణ..గత ఏడాది ఏప్రిల్ 24వ తేదీన ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. రేపు సీజేఐగా జస్టిస్ యుయు లలిత్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఎన్నికల ఉచితాల పైన విచారణ సమయంలో పలువురు సీనియర్ న్యాయవాదులు జస్టిస్ ఎన్వీ రమణకు శుభాకాంక్షలు చెప్పారు. సీనియర్లు ఎమోషనల్ అయ్యారు. 2018లో న్యాయస్థాన ప్రొసీడింగ్స్ ను లైవ్ ఇచ్చేందుకు వీలుగా సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజున దీనిని అధికారికంగా అమలు చేసారు. ఈ సాయంత్రం సుప్రీం న్యాయవాదలు సంఘం ఆధ్వర్యంలో సీజేఐ ఎన్వీ రమణకు వీడ్కోలు సభ జరగనుంది.