మంగళూరుకు ప్రధాని నరేంద్రమోదీ పర్యటన ఖరారయ్యింది. సెప్టెంబరు 2వతేదీ శుక్రవారం ప్రధానమంత్రి పర్యటనకు వస్తున్న తరుణంలో జిల్లా ఎంపీ నళిన్‌కుమార్ కటీలు, జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి సునిల్‌కుమార్‌లు గురువారం సమీక్ష జరిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్దిదారులతో ప్రధానమంత్రి మోదీ సమీక్ష జరుపనున్నారు. ఇందుకోసం లబ్దిదారులను ఎంపిక చేసే ప్రక్రియను జిల్లాధికారికి అప్పగించారు. ప్రాంతాల జిల్లాకు చెందిన అన్ని ప్రాంతాల నుంచి వివిధ పథకాల లబ్దిదారులను సభకు తీసుకువచ్చేలా నిర్ణయించారు. నవమంగళూరు ఓడరేవులో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మించనున్న రూ.3600ల కోట్ల పనులకు లాంఛనంగా ఆవిష్కరించనున్నారు. ఆతర్వాత గోల్డ్ పించ్ సిటీలో బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు.
ప్రధానమంత్రి పర్యటనకు సంబంధించి ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నళిన్‌కుమార్ కటీలు మీడియాతో మాట్లాడుతూ 2014 నుంచి 2022 దాకా ప్రధానమంత్రి మోదీ పాలనలో దక్షిణకన్నడ జిల్లాకు రూ.27వేల కోట్ల మేర గ్రాంట్లు కేటాయించారన్నారు. 14, 15వ ఆర్థికసంఘం పరిధిలో పంచాయతీలు, జాతీయ రహదారి, రైల్వే, బందరుతో పాటు వివిధ పతకాలకు గ్రాంట్లు విడుదల చేశారన్నారు. మంగళూరులో ప్లాస్టిక్ పార్క్ టెండర్ జరిగిందని, కోస్ట్‌గార్డు నిర్మాణాలు సాగుతున్నాయన్నారు. కాగా బహిరంగసభకు కనీసం లక్షమంది ప్రజలు పాల్గొంటారన్నారు. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ లబ్దిదారులు కనీసం పదిలక్షల మంది ఉన్నారని వారందరినీ ఆహ్వానిస్తామన్నారు. కానీ జిల్లాకు చెందిన లబ్దిదారులతో ప్రధాని చర్చాగోష్టిలో పాల్గొనేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కాగా మంగళూరుకు ప్రధానమంత్రి సుధీర్ఘకాలం తర్వాత వస్తున్నారు.
ఇటీవల దక్షిణకన్నడ జిల్లాలో బీజేపీ యువనాయకుడు ప్రవీణ్ నెట్టారును పతకం ప్రకారం మరో వర్గానికి చెందినవారు హత్య చేయడంతో పార్టీకి చెందిన యువనాయకులు రాజీనామాలకు సిద్దమైన విషయం తెలిసిందే. ఎంపీ నళిన్‌కుమార్ కటీలను ఘెరావ్ చేసి దూషించడం వైరల్ అయ్యింది. ఇటువంటి తరుణంలో ప్రధానమంత్రి పర్యటనలో బీజేపీ యువవర్గాలు ఏవిధంగా సమస్యలు చెప్పనున్నారో అనేది కీలకంగా మారింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటనకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసే విషయమై కూడా డీజీపీ స్థాయిలో కీలక సమావేశం జరుపతలపెట్టారు.