మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సెక్యూరిటీని రివ్యూ చేసిన ఎన్ఎస్‌జీ కొత్తగా మరో ఇరవై మంది కమెండోలతో భద్రత కల్పించాలని నిర్ణయించారు. ఇప్పటి వరకూ ఆయనకు జడ్ ప్లస్ కేటగిరి నిబంధనల ప్రకారం షిఫ్ట్‌కు ఎనిమిది మంది భద్రత కల్పించేవారు. ఇప్పుడు వారి సంఖ్యను మరో ఇరవై మందికి పెంచారు. ఇప్పటి వరకూ డీఎస్పీ ర్యాంక్ అధికారి పర్యవేక్షణలో ఆయన భద్రత ఉండేది. ఇనుంచి డీఐజీ స్థాయి అధికారి భద్రతను పర్యవేక్షించనున్నారు.
సాధారణంగా కేంద్రం.. ఫిర్యాదులు..విజ్ఞప్తుల మేరకే ఈ స్థాయి భద్రతా ఏర్పాట్లు చేయదు. ఆయనకు ముప్పు ఉందని స్పష్టమైన సమాచారం వస్తేనే చేస్తుంది. ఏపీలో రాజకీయ పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయి. ప్రత్యర్థుల్ని భౌతికంగా నిర్మూరించడానికి కూడా వెనుకాడనంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయని నిఘా వర్గాలు నివేదించినట్లుగా తెలుస్తోంది. అలాంటి ఖచ్చితమైన సమాచారం ఉంటే.. ఈ స్థాయిలో భద్రతను పెంచుతారని అంచనా వేస్తున్నారు.
చంద్రబాబు భద్రత విషయంలో ఏపీ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు కాన్వాయ్‌పై రాళ్లు వేసినా పెద్దగా పట్టించుకోవడం లేదు. అదో ప్రజాస్వామ్య నిరసన అన్నట్లుగా ప్రకటనలు చేశారు. దీంతో పోలీసులు కూడా అచేతనం అయ్యారని.. ఎన్‌ఎస్‌జీ గుర్తించినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా జడ్ ప్లస్ కేటగిరి భద్రత ఉన్న ఓ రాజకీయ నాయకుడికి రాజకీయ ప్రత్యర్థుల నుంచే ముప్పు ఎక్కువగా ఉందని భద్రత పెంచడం అనూహ్యమేనని చెప్పుకోవచ్చు.