భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో ఏడాదికి ఒకసారి శ్రావణమాసంలో చివరి శుక్రవారం పుష్పార్చన నిర్వహిస్తారు. ఈ పుష్పార్చనలోనూ దేవస్థానం అధికారులు కోత విధిస్తుండటం పట్ల భక్తులు ఆక్షేపణలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో 100కిలోల పుష్పాలతో అమ్మవారికి పుష్పార్చన నిర్వహించే వారు. కాగా ఇటీవల సగానికి సగం పుష్పాలను తగ్గించడం ఎంత వరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై దేవస్థానం వైదిక, పరిపాలన వర్గాలు సైతం అధికారులు వ్యవహరిస్తున్న తీరుపట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
ఏటా రూ. కోట్ల ఆదాయం ఉన్న దేవస్థానంకు ఏడాదికోసారి అమ్మవారికి పుష్పార్చన నిర్వహించేందుకు పూలు సైతం కరువేనా అనే వ్యాఖ్యలు వినిపిస్తుండటం గమనార్హం. గతంలో ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కడియం నుంచి భారీ ఎత్తున పుష్పాల్లోని వివిధ రకాలను తెప్పించేవారు. కాని రాను రాను అధికారులు పొదుపు పేరుతో పుష్పార్చనలోనూ కోత విధించడం పట్ల పలువురు భక్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.