రాజకీయాల్లో రంగు ప్రవేశం చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా ట్విట్టర్ లో సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నారు. జనసేన పార్టీ అధ్యక్షుడు, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ట్విట్టర్ లో 5 మిలియన్ మార్క్ అందుకున్నారు. ఆయనను ట్విట్టర్ లో అనుసరించేవారి సంఖ్య 50 లక్షలకు చేరింది. పవన్ కల్యాణ్ 2014 ఆగస్టులో ట్విట్టర్ ఖాతా ప్రారంభించారు. ఈ ఎనిమిదేళ్ల కాలంలో ఆయన లక్షలాది మంది ఫాలోవర్లను సొంతం చేసుకున్నారు. పవన్ తన ట్విట్టర్ అకౌంట్లో రాజకీయపరమైన వ్యాఖ్యల కంటే, ప్రపంచ విషయాలు, పుస్తకాలు, తదితర అంశాలకు సంబంధించిన పోస్టులు పెడుతుంటారు.
ఇదిలా ఉంటే ఆయన 5 మిలియన్ల ఫాలోవర్లను సొంతం చేసుకున్న నేపథ్యంలో, జనసేన పార్టీ స్పందించింది. పవన్ ను ట్విట్టర్ లో అనుసరిస్తున్న ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు వెల్లడించింది. పొగడ్త అయినా, సద్విమర్శ అయినా శిరోధార్యమేనని, మెరుగైన సలహాలు, సూచనలకు ఎల్లవేళలా ఆహ్వానం పలుకుతామని పేర్కొంది. మీ అభిమానం అనిర్వచనీయం, ఆనందదాయకం అని ఓ ప్రకటన వెలువరించింది.