విశాఖ సాయి ప్రియా వ్యవహారంలో తాజాగా ఆమె తండ్రి మెడకు కేసు చుట్టుకొంది. దీంతో విశాఖ సాయి ప్రియ కేసు వ్యవహారం మరో మలుపు తిరిగింది. సాయి ప్రియ తండ్రి రామిరెడ్డి అప్పలరాజుపై త్రీ టౌన్‌లో కేసు నమోదు చేశారు. సాయి ప్రియ ప్రేమ వ్యవహరం తెలిసినా ఏమి చెప్పకుండా.. దాచి ఉంచి బాధ్యతారహిత్యంగా వ్వవహరించిన తండ్రి అప్పలరాజుపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఉద్దేశ్య పూర్వకంగానే జిల్లా యంత్రాగాన్ని, పోలీసులను, కోస్ట్ గార్డ్‌లను తప్పుదోవ పట్టించడంపై కేసు నమోదు చేశారు. ఈ మేరకు పోలీసులు మీడియాకు ప్రకటన విడుదల చేశారు.
గత నెల25న సాయిప్రియ విశాఖపట్నం సిటీ ఆర్కే బీచ్‌కు తన భర్తతో పాటు వచ్చి.. సముద్రపు ఒడ్డున సముద్రపు నీటిలోని దిగి కాలు కడుగుతున్నారని.. అదే సమయంలో ఆమె భర్తకు ఫోన్ వచ్చినట్లు.. ఈలోగా సదరు సాయిప్రియ సముద్రంలో గల్లంతయినట్లు ఆమె తండ్రి ఫిర్యాదుతో త్రీటౌన్ పోలీస్ స్టేషన్ నందు Cr No.379/2022 U/H Woman Missingగా నమోదు చేశామన్నారు పోలీసులు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా విశాఖపట్నం సిటీ పోలీస్ యంత్రాంగం సుమారు 48 గంటలు శ్రమించి సదరు సాయిప్రియ జాడను కనుక్కున్నట్లు చెప్పారు.
తదుపరి విచారణలో సదరు సాయిప్రియ కావాలని ముందుస్తు ప్రణాళిక ప్రకారం తనకు తెలిసిన రవితేజ అనే వ్యక్తితో ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్లు.. ఈ విషయం సాయిప్రియ తండ్రి అప్పలరాజుకు తెలుసు అన్నారు. ఆమె కోసం వెతుకుతున్నట్లు తెలిసి కూడా.. కుమార్తె సాయిప్రియ సమాచారం ఇవ్వవలసిన భాద్యత ఉన్నా.. కూడా ప్రభుత్వ యంత్రాంగం, పోలీస్‌శాఖ వారిని తప్పుదోవ పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ విలువైన కాలాన్ని వృధా చేసి, అదే విధంగా రక్షణ దళమైన ఇండియన్ నేవీ, ఇండియన్ కోస్ట్ గార్డ్ హెలికాప్టర్ ద్వారా సెర్చ్ ఆపరేషన్ కొనసాగించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇలా ప్రభుత్వ వ్యయం ఖర్చు చేయించారని.. కుమార్తె సాయిప్రియ తండ్రి అప్పలరాజు కూతురి గురించి సమాచారం తెలిసినా చెప్పకపోవడంపై కోర్టు అనుమతితో త్రీటౌన్ పోలీస్ స్టేషన్ నందు Cr No.424/2022 U/S 182 IPC కేసు రిజిస్టర్ చేశామని పోలీసులు తెలిపారు.
అంతేకాదు సాయిప్రియ, ఆమె ప్రియుడు రవితేజపై కూడా ఇప్పటికే త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. తప్పుదోవ పట్టించి.. ప్రభుత్వ ధనం, సమయం వృథా చేసినందుకు సాయిప్రియ, ఆమె ప్రియుడిపై కోర్టు అనుమతితో పోలీసులు కేసు నమోదు చేశారు. సాయిప్రియ చేసిన పనితో ప్రజాధనం.. నేవీ, కోస్ట్‌గార్డ్, పోలీసుల సమయం వృథా అయ్యిందన్నారు.
విశాఖకు సంజీవయ్య నగర్‌కు చెందిన సాయిప్రియకు రెండేళ్ల క్రితం శ్రీకాకుళం జిల్లాకు చెందిన శ్రీనివాసరావుతో వివాహమైంది. భర్త శ్రీనివాసరావు ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తుండగా.. సాయిప్రియ ఓ కోర్సు కోసం విశాఖలో తల్లిదండ్రుల దగ్గర ఉంటున్నారు. ఈనెల 25న పెళ్లిరోజు కావడంతో భార్యాభర్తలు ఆర్కే బీచ్‌కు వెళ్లారు. రాత్రి 7.30 గంటల సమయంలో.. శ్రీనివాసరావుకు ఫోన్ రావడంతో పక్కకు వెళ్లి మాట్లాడి తిరిగి వచ్చేలోపు సాయి ప్రియ కనిపించలేదు.
వెంటనే ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సముద్రంలో గల్లంతైందని భావించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. రెండు రోజులపాటు నేవీ హెలికాప్టర్, స్పీడ్ బోట్లతో ఆమె కోసం సముద్రంలో గాలించారు. అప్పుడే ఆమె బీచ్‌లో గల్లంతవ్వలేదని.. సురక్షితంగానే ఉన్నట్లు గుర్తించారు. ముందు నెల్లూరులో ఉన్నారని భావంచారు.. కానీ ఆమె తన ప్రియుడితో బెంగళూరులో ప్రత్యక్షమైంది. ఆమె తన తండ్రికి వాట్సాప్‌లో వాయిస్ మెసేజ్‌లు పంపింది.. తాను ప్రియుడు రవితేజతో బెంగళూరులో క్షేమంగానే ఉన్నానని.. తన కోసం వెతకొద్దని చెప్పింది.
రవితేజతో తనకు పెళ్లయిపోయిందని.. తాళిబొట్టుతో ఉన్న ఫొటోను తల్లిదండ్రులకు వాట్సాప్‌లో పంపింది. తాను రవితో ఇష్టపూర్వకంగానే వెళ్లానని.. తన కోసం వెతికితే చనిపోతానని హెచ్చరించింది. ఆ తర్వాత సాయిప్రియను పోలీసులు విశాఖ తీసుకొచ్చారు.. కౌన్సిలింగ్ ఇవ్వాలని అనుకున్నారు. ఆమె భర్తను పిలిచినా రాకపోవడంతో ఆమెను ప్రియుడితోనే పంపించారు. సాయిప్రియ మేజర్ కావడంతో ఆమె ఇష్టం మేరకు ప్రియుడితో వెళ్లిపోయారు. అలాగే అందరికి క్షమాపణలు చెప్పారు. తమ వల్ల ప్రభుత్వానికి డబ్బులు ఖర్చయినందుకు క్షమించాలని ఇద్దరు అడిగారు.