బీజేపీ పాలనలో దేశ అవినీతి రాజధానిగా కర్ణాటక తయారయిందని... దీన్నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే హిజాబ్, హలాల్, ఈద్గా వంటి సమస్యలను బీజేపీ తెరపైకి తెస్తోందని కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ తీవ్ర విమర్శలు గుప్పించారు. విద్యాసంస్థల్లో హిబాబ్ ను ధరించడం అనేది గత ఏడాది కర్ణాటకలో ఉద్రిక్తతలకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బెంగళూరులోని ఈద్గా మైదానంలో గణేశ్ చతుర్థి వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినివ్వడం, దాన్ని హైకోర్టు సమర్థించడం, ఆ తర్వాత ప్రభుత్వ ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించడం జరిగింది. వీటన్నింటి నేపథ్యంలో డీకే స్పందించారు.
రాష్ట్రంలో జరుగుతున్న అంతులేని అవినీతిపై ప్రధాని మోదీకి కాంట్రాక్టర్ల అసోసియేషన్ లేఖ రాసిందని... లేఖ రాయాల్సిన పరిస్థితి వారికెందుకు దాపురించిందని డీకే ప్రశ్నించారు. తాను తినను, ఎవరినీ తిననివ్వనని ప్రధాని మోదీ అంటుంటారని... అలాంటప్పుడు కర్ణాటకలో ఏం జరుగుతోందంటూ ప్రధానిని కాంట్రాక్టర్ల అసోసియేషన్ ఎందుకు ప్రశ్నించిందని అడిగారు.
కర్ణాటకలోని అవినీతి గురించి ప్రధానికి కాంట్రాక్టర్ల అసోసియేషన్ లేఖ రాయడం ఇది రెండోసారని చెప్పారు. ప్రాజెక్టు విలువలో 40 శాతాన్ని ప్రభుత్వ అధికారులకు లంచాలుగా ఇవ్వాల్సి వస్తోందని కాంట్రాక్టర్లు వాపోతున్నారని అన్నారు. కాంగ్రెస్ హయాంలో 10 శాతం మాత్రమే లంచాలుగా ఇచ్చేవారమని ప్రధానికి రాసిన లేఖలో కాంట్రాక్టర్లు పేర్కొన్నారని... రాష్ట్రం ఎటు పోతోందని ప్రధానిని వారు ప్రశ్నించారని తెలిపారు.
విద్యా వ్యవస్థలో కూడా అంతులేని అవినీతి ఉందని డీకే చెప్పారు. సర్టిఫికెట్ల రెన్యువల్స్ కు, ఫైర్, సేఫ్టీ క్లియరెన్స్ కు అధికారులకు భారీగా లంచాలను ఇవ్వాల్సి వస్తోందని మోదీకి రెండు స్కూల్స్ అసోసియేషన్లు లేఖలు రాశాయని తెలిపారు. వీకర్ సెక్షన్ విద్యార్థులకు సంబంధించి ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులను పొందాలన్నా లంచాలు ఇవ్వాల్సి వస్తోందని లేఖలో వారు పేర్కొన్నారని చెప్పారు. ఉన్నత విద్యావంతులు ఉన్న కర్ణాటకలో ఇలా జరుగుతుండటం సిగ్గుపడాల్సిన విషయమని అన్నారు.