మైనర్ బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణలతో ఓ మఠాధిపతి అరెస్ట్ అయ్యాడు. కర్ణాటకలోని చిత్రదుర్గలోని లింగాయత్ మఠం ప్రధానార్చకుడు శివమూర్తి మురుగ శరణారావును మైసూరు పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వైద్య పరీక్షల నిమిత్తం చిత్రదుర్గలోని ప్రభుత్వాసుపత్రికి ఆయనను తీసుకెళ్లారు. తమపై అత్యాచారం చేశాడని ఇద్దరు బాలికలు చేసిన ఫిర్యాదుతో ఆయనపై పోక్సో కేసు నమోదు అయింది.
కర్ణాటకలోని చిత్రదుర్గలోని ప్రముఖ మురుగ మఠం అధిపతి శివమూర్తిని హవేరి జిల్లాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మఠం నిర్వహించే సంస్థలో విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. లింగాయత్ మత ఆశ్రమంలో చదువుకున్న ఇద్దరు మైనర్లు తమ మఠాధిపతి శివమూర్తి మురుగ శరణరావు తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ మైసూర్ నగర పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు శివమూర్తి మురుగ శరణారావుపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అతనిపై పోక్సో చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది.