ప్రజల కోసం తపనపడే మనిషి, ప్రజల తరపున పోరాడే నాయకుడు, కోట్ల మంది అభిమానుల గుండె చప్పుడు, సినిమాల్లో పవర్ స్టార్, బయట పబ్లిక్ స్టార్.. ఆయనే జనం కోసం జనసేన పార్టీ పెట్టిన జనసేనాని పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ 1968 సెప్టెంబర్ 2న బాపట్లలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు కొణిదెల వెంకటరావు, అంజనాదేవి. పవన్ కు ఇద్దరు అక్కలు, ఇద్దరు అన్నలు ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి పవన్‌కు పెద్దన్నయ్య, నాగేంద్ర బాబు రెండవ అన్నయ్య. పవన్ కళ్యాణ్ నెల్లూరులో ఇంటర్ చదివి, ఆ తర్వాత కంప్యూటర్స్ లో డిప్లోమా చేశాడు.
పవన్ కళ్యాణ్ తన పెద్ద అన్నయ్య చిరంజీవిని చూసి నటన పట్ల ఆసక్తిని పెంచుకున్నాడు. 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా ద్వారా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. పవర్ స్టార్ గా ఎదిరి బాక్స్ ఆఫీస్ రికార్డులను బద్దలు కొడుతున్నాడు. పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు 27 సినిమాలు చేశారు. ఆయన వ్యక్తిత్వం, సేవాగుణం ఆయనకు కోట్లాది అభిమానుల్ని పొందేలా చేసింది. పవన్ నటుడిగానే కాకుండా దర్శకుడిగా, రచయితగా, గాయకుడిగా తన ప్రతిభను ప్రదర్శించి ఆకట్టుకున్నారు. ప్రస్తుతం హరిహరవీరమల్లు, భవదీయుడు భగత్ సింగ్ సినిమాలు చేస్తున్నారు.
రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్న పవన్ కళ్యాణ్ 2014లో మార్చి 14న 'జనసేన' పేరుతో రాజకీయ పార్టీని స్థాపించారు. జనసేన 2014 ఎన్నికలప్పుడు నేరుగా పోటీలో దిగకుండా టీడీపీ-బీజేపీ కూటమికి మద్దతునిచ్చింది. జనసేన పార్టీ 2019 ఎన్నికలలో నేరుగా ఏపీలో పోటీ చేసినా, కేవలం ఒక సీటు మాత్రమే గెలుచుకోగలింది. పవన్ కళ్యాణ్ కూడా ఎన్నికల్లో ఓడిపోయారు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడూ విమర్శిస్తూ క్రమంగా పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. 2023 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. ఆయన అనుకున్నది సాధించాలని, ప్రజలకు మరింత సేవ చేయాలని కోరుకుంటూ.. పవన్ కళ్యాణ్ కి జన్మదిన శుభాకాంక్షలు.