ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఉమ్మడిగా ఉన్నప్పుడు సీఎంగా వైఎస్ రాజశేఖరరెడ్డి పనిచేసింది కేవలం ఐదేళ్ల మూడు నెలలే ఐనా కానీ, ఆ కొద్దికాలంలోనే ఆయన రాష్ట్ర ప్రజల గుండెల్లో కలకాలం గుర్తుంచుకునేలా సుపరిపాలన అందించారు. పాలకుడంటే ఇలా ఉండాలి అని దేశానికి చాటిచెప్పిన మహా నాయకుడు రాజశేఖర్ రెడ్డి అనడంలో సందేహం లేదు. సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలనతో ప్రజల హృదయాల్లో చెరగని ముద్రవేశారు. ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన జీవిత నేపథ్యంలో జరిగిన కొన్ని మైలు రాళ్లు తెలుసుకుందాం.
అప్పటి కడప జిల్లా జమ్మలమడుగులో 1949, జూలై 8న జన్మించిన వైఎస్.. వైద్య విద్యను అభ్యసించారు. పులివెందులలో ఆస్పత్రిని ఏర్పాటుచేసి.. రూపాయికే వైద్యంచేసి రూపాయి డాక్టర్‌గా ప్రజల ప్రశంసలు అందుకున్నారు. డాక్టర్‌గా ప్రజల నాడి తెలిసిన వైఎస్ రాజశేఖరరెడ్డి పులివెందుల నియోజకవర్గం నుంచి 1978లో రాజకీయ అరంగేట్రం చేశారు. అప్పటినుంచి తుదిశ్వాస విడిచే వరకూ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసం రాజీలేని పోరాటం చేశారు. దాంతో పులివెందుల నుంచి 1978, 1983, 1985.. కడప లోక్‌సభ స్థానం నుంచి 1989, 1991, 1996, 1998.. ఆ తర్వాత పులివెందుల నుంచి 1999, 2004, 2009 ఎన్నికల్లో విజయం సాధించారు.
ఓటమి ఎరుగని నాయకుడిగా ప్రజల గుండెల్లో నిలవడమే కాకుండా 2004 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రావడానికి, ప్రజలకి మేలు చేయాలన్న సంకల్పంతో పాదయాత్ర చేసి ఎనలేని విజయం సాధించి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసారు. ఐదేళ్ల పాలన ప్రజలకి నచ్చడంతో 2009 లో మరో సారి ప్రజలు అధికారం కట్టబెట్టారు. అయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైద్యకి సంబంధించి 108 అంబులెన్స్ , ఆరోగ్యశ్రీ పధకం ప్రజలకి ఎంతగానో చేరువయ్యాయి. అలానే పేద ప్రజల కోసం తీసుకువచ్చిన రెండు రూపాయలకే కిలో బియ్యం, వృద్యాప్య పెన్షన్ పెంపుదల లాంటివి ప్రజల గుండెల్లో అయన మీద ఎనలేని ప్రేమని పెంచాయి. ప్రజా సమస్యలు నేరుగా తీర్చాలి అనే సంకల్పంతో ఆయన ప్రవేశ పెట్టిన మరో కార్యక్రమమే రచ్చ బండ . ఈ కార్యక్రమంలో భాగంగా హెలికాప్టర్ లో ప్రయాణం చేస్తున్న అయన వాతావరణ పరిస్థితులు అనుకూలించక ప్రమాదానికి గురై అయన అనంతలోకాలకు వెళ్లడం జరిగింది. ఈ వార్త విన్న అభిమానులు ఎంతో మంది ఆ సమయంలో చనిపోయారన్న విషయం అందరికి తెలిసిందే.
అలానే తర్వాత రాజకీయ పరిణామాల వలన రాష్ట్రము రెండు రాష్ట్రాలుగా విడిపోవడం జరిగింది. ప్రస్తుతం ఆయన తనయుడు జగన్ సొంత పార్టీ స్థాపించి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నెరవేరుస్తున్న సంగతి తెలిసిందే. ప్రజల మనిషి, దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన తనయుడు, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. వైయస్ఆర్ జిల్లా ఇడుపులపాయలోని వైయస్ఆర్ ఘాట్‌కు చేరుకున్న సీఎం వైయస్ జగన్, కుటుంబ సభ్యులు మహానేత వైయస్ఆర్ సమాధి వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి సీఎం ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. దివంగత మహానేత సతీమణి వైయస్ విజయమ్మ, వైయస్ భారతి, కుటుంబ సభ్యులు, డిప్యూటీ సీఎం అంజాద్ భాషా, ఎంపీ వైయస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
వైయస్ఆర్ జ్ఞాపకాలు, ఆశయాలను తలచుకుంటూ సీఎం వైయస్ జగన్ మాట్లాడుతూ... ``నాన్న భౌతికంగా దూరమైనా నేటికీ ఆయన చిరునవ్వు, ఆ జ్ఞాపకాలు అలానే నిలిచి ఉన్నాయి. దేశచరిత్రలోనే సంక్షేమాన్ని సరికొత్తగా నిర్వచించి.. ప్రజల అవసరాలే పాలనకు ప్రధానాంశం కావాలని ఆయన చాటిచెప్పారు. ప్రతి అడుగులోనూ నాన్నే స్ఫూర్తిగా ఇకపై కూడా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తుంది`` అని ముఖ్యమంత్రి వైయస్ జగన్ తెలియజేసారు.