జింబాబ్వే సంచలనం సృష్టించింది. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో ఆస్ట్రేలియాకు షాకిచ్చింది. శనివారం జరిగిన మూడో వన్డేలో జింబాబ్వే మూడు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 31 ఓవర్లలో 141 పరుగులకు ఆలౌటైంది. వార్నర్ ఒక్కడే ఆసీస్ బ్యాట్స్‌మెన్‌గా పోరాడాడు. 96 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సర్లతో 94 పరుగులు చేశాడు. వార్నర్ తర్వాత మ్యాక్స్ వెల్ 19 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఆసీస్ బ్యాట్స్‌మెన్‌లలో ఈ ఇద్దరు మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు.జింబాబ్వే బౌలర్ ర్యాన్ బర్ల్ ధాటికి ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్స్ విలవిల లాడారు. మూడు ఓవర్లు మాత్రమే వేసిన బర్ల్ పది పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీశాడు.
142 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ జట్టుకు జింబాబ్వే ఓపెనర్లు కైతానో, మారుమణి నిలకడగా ఆడటంతో శుభారంభం లభించింది. మారుమణి 35, కైటానో 19 పరుగులు చేసి ఔటయ్యారు. ఆ తర్వాత జింబాబ్వే వరుసగా మూడు వికెట్లు కోల్పోయింది. చకబ్వా తన ఇన్నింగ్స్‌తో జింబాబ్వేకు విజయాన్ని అందించాడు. టెయిలెండర్లతో జింబాబ్వేను గెలిపించాడు. చకబ్వా 37 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. జింబాబ్వే 39 ఓవర్లలో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆసీస్ బౌలర్లలో హేజిల్ వుడ్ మూడు వికెట్లు తీయగా, స్టోయినిస్, స్టార్క్, అగర్, గ్రీన్ తలో వికెట్ తీశారు.