పల్లె ప్రజల సౌకర్యార్థం ఆర్టిసి మరిన్ని పల్లె సర్వీసులను ప్రవేశపెట్టడం హర్షదాయకమని వైఎస్ఆర్సిపి రాయచోటి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. రాయచోటి ఆర్ టి సి బస్ స్టాండ్ లో శనివారం రెండు నూతన బస్ సర్వీసులను ఆర్ టి సి అధికారులు, ప్రజా ప్రతినిధులుతో కలసి శ్రీకాంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ఆర్టిసి ప్రయాణీకులకు బుస్సులలోనూ, బస్ స్టాండ్ లలో మరిన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. ఆర్టిసి సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసి ఉద్యోగుల జీవితాలలో సీఎం జగన్ వెలుగులు నింపారన్నారు. బస్ స్టాండ్ విస్తరణ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి రూ2. 50 కోట్ల నిధులు తెప్పించడం జరిగిందన్నారు.
ఈ నిధులతో నూతన హంగులతో బస్ స్టాండ్ ను విస్తరణ అభివృద్ధి పనులను చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ క్రమంలోనే అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటి ఆర్టిసిడిపో, బస్ స్టాండ్ లను విస్తరించి మరిన్ని నూతన సర్వీసుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం డిపో లో ఉన్న సర్వీసులపై ఆర్ఎం జగదీష్, ఈఈ వెంకటరమణ, డిఎం ధనంజయ్ ల నడిగి తెలుసుకున్నారు. బస్ స్టాండ్ విస్తరణ అభివృద్ది పనులను ఆరు నెలల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మరింత బాధ్యతతో పనిచేసి ప్రయాణీకులను గమ్యస్థానాలకు ఆర్ టిసి అధికారులు కార్మికులు చేర్చి ప్రజల మన్ననలను పొందాలని శ్రీకాంత్ రెడ్డి సూచించారు.