విజయనగరం జిల్లా: శృంగవరపుకోట నియోజకవర్గంలో పగటి ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకుని వేసవి కాలాన్ని తలపిస్తున్నాయి. గత రెండు రోజుల నుండి నియోజకవర్గంలో భానుడు ఉగ్ర రూపం దాల్చడంతో ప్రజలు ఆపసోపాలకు గురవుతున్నారు. వర్షాకాలంలో కూడా వేసవికాలాన్ని తలపించినట్లు ఎండలు మండిపోతుండడంతో సాధారణ ప్రజానీకంతో పాటుగా వ్యవసాయ కూలీలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో పొలాల్లో పని చేసుకుంటున్న వ్యవసాయ కూలీలు ఎండ దాటికి తట్టుకోలేక నానా అవస్థలు పడాల్సి వస్తోందని వాపోతున్నారు. వానాకాలంలో ఇలా ఎండలు కాయడం మునుపెన్నడూ చూడలేదని ప్రజలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా భానుడి భగభగలు తగ్గి వరుణుడు కరుణించాలని ఇటు రైతులతో పాటు ప్రజలు ఆశా భావాన్ని వ్యక్తం చేస్తున్నారు.