తాజాగా మన భారతదేశం అరుదైన రికార్డును నమోదు చేసుకొంది. కరోనా సంక్షోభ సమయాన్ని సైతం తట్టుకుని భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా అడుగులు వేస్తోంది. తాజాగా బ్రిటన్ ను అధిగమించి ప్రపంచంలోనే బలమైన ఐదో ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించింది. ఈ విషయాన్ని బ్లూమ్ బర్గ్ వెల్లడించింది. 2021 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో బ్రిటన్ ను దాటేసి ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని చెప్పింది. ఐఎంఎఫ్ నుంచి సేకరించిన జీడీపీ గణాంకాల ప్రకారం... 2021 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో భారత్ ఆర్థిక వ్యవస్థ పరిమాణం 854.7 బిలియన్ డాలర్లుగా ఉండగా... యూకే ఆర్థిక వ్యవస్థ పరిమాణం కేవలం 816 బిలియన్ డాలర్లు మాత్రమేనని తెలిపింది.
మరోవైపు ప్రస్తుతం బ్రిటన్ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఆ దేశ ద్రవ్యోల్బణం రికార్డు స్థాయికి చేరుకుంది. రాబోయే రోజుల్లో బ్రిటన్ జీడీపీ మరింత పతనమయ్యే ప్రమాదముందని బ్లూమ్ బర్గ్ పేర్కొంది. దశాబ్దం క్రితం ప్రపంచ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్ 11వ స్థానంలో ఉండగా... బ్రిటన్ 5వ స్థానంలో ఉంది. ఇప్పుడు భారత్ ఐదో స్థానానికి ఎగబాకగా... బ్రిటన్ ఆరో స్థానానికి దిగజారింది.