కర్మ సిద్ధాంతం తప్పకుండా పని చేస్తుందని బ్రిటన్ ను ఉద్దేశించి ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు. ప్రపంచ బలమైన ఆర్థిక వ్యవస్థల్లో ఐదో స్థానానికి భారత్ ఎగబాకింది. ఈ క్రమంలో బ్రిటన్ ను ఆరో స్థానానికి నెట్టేసింది. ఈ నేపథ్యంలో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తన శైలిలో బ్రిటన్ పై సెటైర్లు వేశారు. కర్మ సిద్ధాంతం తప్పకుండా పని చేస్తుందని ఆయన ట్వీట్ చేశారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతో కష్టపడి, పోరాడి, త్యాగాలు చేసిన ప్రతి భారతీయుడి హృదయం ఉప్పొంగుతోందని అన్నారు. భారత్ గందరగోళంలో పడుతుందని భావించిన ప్రతి ఒక్కరికీ ఇదొక గట్టి సమాధానం అని చెప్పారు.
మరోవైపు, కోటక్ మహీంద్రా సీఈవో ఉదయ్ కొటక్ స్పందిస్తూ... మన వలస పాలకులైన బ్రిటన్ ను అధిగమించి భారత్ ఐదో అతి పెద్ద ఆర్థిక శక్తిగా అవతరించడం గర్వించదగ్గ క్షణమని చెప్పారు. మనం సాధించాల్సింది ఇంకా ఉందని అన్నారు.