నమ్మినందుకు నట్టేటా ముంచాడు. డబ్బును ముందు స్నేహితుడినే మరిచాడు. నమ్మకంగా ఉంటున్న స్నేహితుడే ద్రోహం చేశాడు.. ఒకటి కాదు రెండు కాదు 24 నెలలుగా తీసుకున్న సొమ్ము తిరిగివ్వకుండా కాలయాపన చేయసాగాడు. కూతురు పెళ్లికైనా అందించాలని అడిగితే ఊహించని సమాధానం రావడంతో.. ఆ గుండె తట్టుకోలేక పోయింది. ఇంకొద్ది రోజుల్లో కూతురు పెళ్లనగా.. డబ్బు లేదన్న దిగులుతో గుండెపోటుతో మరణించాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది.
పోలీసులు, బాధితుల కథనం మేరకు.. కనిగిరి నియోజకవర్గం వెలిగండ్ల మండలం గన్నవరం సర్పంచ్ మల్లెబోయిన నారాయణమ్మ భర్త తిరుపతయ్య, బ్రాహ్మణపల్లికి చెందిన పెండ్యాల రఘురామయ్య స్నేహితులు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఇద్దరూ బాగానే సంపాదించారు. రఘురామయ్య కనిగిరిలో సెటిల్ అవ్వగా.. తిరుపతయ్య గన్నవరంలోనే ఉంటూ బిజినెస్ చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో రెండేళ్ల కిందట రఘురామయ్య.. తిరుపతయ్య నుంచి రూ.46 లక్షలు తీసుకున్నాడు. వెలిగండ్లలో స్థలం ఉందని అది అమ్మిన వెంటనే ఇస్తాననడంతో తిరుపతయ్య కూడా డబ్బులు ఇచ్చాడు.
అయితే, ఆ స్థలంలో అన్నదమ్ములకు వాటా ఉండటంతో అమ్మడానికి అడ్డంకులు ఏర్పడ్డాయి. తిరుపతయ్య తాను ఇచ్చిన డబ్బును తిరిగివ్వాలని రఘురామయ్యను కోరగా.. కనిగిరిలోని ఇల్లు అమ్మి ఇస్తానని చెప్పాడు. ఇలా రెండేళ్లు గడిచిన తర్వాత ఇటీవల తిరుపతయ్య కుమార్తెకు పెళ్లి కుదిరిందని.. ఎలాగైనా పెళ్లి సమయానికి డబ్బు చూడాలని కోరాడు. అయితే రఘురామయ్య ఆ డబ్బు ఇవ్వనని చెప్పాడని.. దాంతో తీవ్ర మనస్తాపానికి గురైన తిరుపతయ్య కూతురు భవిష్యత్ గురించి ఆలోచిస్తూ గుండెపోటుతో మరణించాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
రఘురామయ్య కారణంగానే తిరుపతయ్య మరణించాడంటూ.. మృతదేహాన్ని కనిగిరిలోని రఘురామయ్య ఇంటి ముందు ఉంచి బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. అయితే, అప్పటికే సమాచారం అందడంతో రఘురామయ్య ఇంటికి తాళం వేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు బాధితులతో మాట్లాడి మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించారు.