రాష్ట్రంలో ఇంట్లోంచి టిడిపి నేతలు భయటకు వస్తే కేసులు పెడుతున్నారన్నారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. జగన్‌కు నిద్రలో కూడా టీడీపీ నేతలే గుర్తుకు వస్తున్నారని.. పోలీసులు లేకుండా వైఎస్సార్‌సీపీ వాళ్లు వస్తే.. ఒక్క నిమిషంలో వారి పని తేలిపోతుంది అన్నారు. ఇది సవాల్ అంటూ వ్యాఖ్యానించారు. నేతలు తమ సౌకర్యం కోసం ఇంట్లో పడుకుంటే.. ఎన్నికల అనంతరం కూడా ఇంట్లో ఉండాల్సి వస్తుంది అని హెచ్చరించారు. కేసులు, దాడులపై న్యాయ పరంగా, రాజకీయంగా పోరాడుతాం.. ఎవరిని వదలం అన్నారు.
తనపైనా కేసులు పెట్టేందుకు వెతుకుతున్నారని.. తన పేరు చెప్పమని కేసులు పెట్టి బాధితులను ఒత్తిడి చేస్తున్నారన్నారు. జగన్ అక్రమాలకు అన్ని సాక్ష్యాలు ఉన్నాయని.. అవినీతి బుదర మనకూ అంటించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఎన్నికలకు 18 నెలల సమయం ఉంది.. జగన్ ఇంకా ముందు ఎన్నికలకు వెళితే రాష్ట్రానికి పట్టిన దరిద్రం పోతుంది అని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఎక్కడా పొత్తుల గురించి తాను మాట్లాడడం లేదని.. పార్టీలో కూడా ఈ విషయంలో క్లారిటీ ఉండాలి అన్నారు. ముందు రాష్ట్రాన్ని కాపాడాలి.. దానికి అందరూ కలిసి రావాలి అన్నారు.
ఇదిలావుంటే టీడీపీ అధినేత చంద్రబాబు దూకుడు పెంచారు. టీడీపీ రాష్ట్ర కమిటీ సమావేశంలో.. త్వరలో నిర్వహించనున్న పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థులను ప్రకటించారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం (ఉమ్మడి కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలు) అభ్యర్థిగా పులివెందుల నియోజకవర్గానికి చెందిన భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డిని అభ్యర్థిగా బరిలోకి దింపుతున్నట్లు తెలిపారు. అలాగే తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం (ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు) అభ్యర్థిగా కంచర్ల శ్రీకాంత్‌ను ఎంపిక చేశామన్నారు. అభ్యర్థులు ఇద్దరినీ కార్యకర్తలకు పరిచయం చేసి.. వారిని గెలిపించే బాధ్యత తీసుకోవాలన్నారు. విశాఖపట్నం పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థినీ త్వరలోనే ప్రకటిస్తామన్నారు.
టీడీపీ సంస్థాగత విషయాల్లో రాజీ పడేది లేదని.. సభ్యత్వ నమోదు పూర్తి చెయ్యాలి అన్నారు అధినేత. పార్టీ కి సంబంధించి గ్రామ స్థాయి వరకు కమిటీలు పూర్తి చెయ్యాలని.. ఓటర్లు వెరిఫికేషన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. లేని పక్షంలో ఓట్లు ఉండవని.. ప్రజల్లో ఎంత చైతన్యం ఉన్నా ఓట్లు లేకపోతే ఏమీ చెయ్యలేమని.. జాగ్రత్తగా ఉండాలని అలర్ట్ చేశారు. గ్రాడ్యుయేట్ ఎన్నికల విషయంలో పార్టీ నేతలు బాధ్యత తీసుకోవాలని.. నేతలు సొంత సోషల్ మీడియాను ఏర్పాటు చేసుకుని.. విస్తృతంగా ఉపయోగించుకోవాలి అన్నారు. దుర్మార్గుల చేతిలో టెక్నాలజీ ఉంటే మరింత ఎక్కువ నష్టమని.. అప్రమత్తంగా ఉండాలి అన్నారు.
నియోజకవర్గ ఇంఛార్జ్ 10 రోజులు నియోజకవర్గంలో ఉండాలని.. నియోజకవర్గ అబ్జర్వర్ 8 రోజులు నియోజకవర్గంలో ఉండాలని సూచించారు. భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, కంచర్ల శ్రీకాంత్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థిలుగా ఉంటారు. వారిని గెలిపించే బాధ్యత పార్టీ నేతలు తీసుకోవాలి అన్నారు. రాష్ట్రంలో తెలుగు దేశం అధికారంలోకి వస్తేనే రాష్ట్ర పునర్ నిర్మాణం సాధ్యమని.. అప్పట్లో ఎక్కువ సమయం పార్టీకి పెట్టలేదు కాబట్టి సమస్యలు వచ్చాయి అన్నారు. పార్టీపై దృష్టిపెట్టిన సందర్భంలో ఓటమి లేదని.. పాలనలో తాను పడిపోయినప్పుడే సమస్యలు వచ్చాయని.. తనను తాను సరి చేసుకుంటున్నాను అన్నారు.