ఉచితంగా సలహాలు ఇవ్వకూడదు...నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడకూడదు. ఉద్యోగాల్లోకి కొత్తగా ప్రవేశించే ఫ్రెషర్లను ఉద్దేశించి చేసిన సూచన కారణంగా ‘బాంబే షేవింగ్ కంపెనీ’ సీఈవో శంతను దేశ్ పాండే తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతే కాదు, ఏకంగా ప్రొఫెషనల్స్ నెట్ వర్క్ ‘లింక్డ్ ఇన్’ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. ఫ్రెషర్లు మొదట్లో 4-5 ఏళ్ల పాటు, రోజుకు 18 గంటల పాటు పనిచేయాలని దేశ్ పాండే సూచించారు. దీనికి నెటిజన్లు విమర్శలతో విరుచుకుపడ్డారు. అంతేకాదు, దేశ్ పాండే తల్లిదండ్రులకు సైతం మెస్సేజ్ లు పంపుతున్నారు. దీంతో దేశ్ పాండే తన తాజా స్పందనను వ్యక్తం చేశారు. లింక్డ్ ఇన్ పై చివరి పోస్ట్ పెట్టారు.
‘‘లింక్డ్ ఇన్ పై ఇదే నా చివరి పోస్ట్. నా పోస్ట్ బాధపెట్టి ఉంటే నన్ను క్షమించండి. సందర్భాన్ని, సూక్ష్మ భేదాన్ని నేను అర్థం చేసుకున్నాను’’ అని దేశ్ పాండే పేర్కొన్నారు. ‘మీ కుమారుడు బానిస స్వభావం కలిగిన యజమాని’ అంటూ తన తల్లిదండ్రులకు కొందరు సందేశాలు పంపినట్టు వెల్లడించారు. నిజానికి కెరీర్ ఆరంభంలో అధిక సమయం పాటు కష్టించి పనిచేయడం ద్వారా మెరుగైన ఫలితాలు రాబట్టొచ్చని, తద్వారా మంచి పునాది వేసుకోవచ్చన్నద్దే దేశ్ పాండే ఉద్దేశ్యం. కానీ, ఫ్రెషర్లు ఉద్యోగం - వ్యక్తిగత జీవనానికి సమ ప్రాధాన్యం ఇవ్వకుండా నిరుత్సాహపరుస్తున్నారంటూ కొందరు తప్పుబట్టడం ఆయన్ను బాధకు గురిచేసిందట.