పోలీసుల సాయంతో రక్త చరిత్ర రాస్తున్నావంటూ ముఖ్యమంత్రి జగన్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శలు చేశారు. ఇదిలావుంటే గర్ల్స్ హైస్కూల్ వద్ద కొందరు వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడిలో గాంధీ కంటికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి తరలించారు. వైఎస్సార్‌సీపీ నాయకులు పాత కక్షలను మనస్సులో పెట్టుకునే ఈ దాడి చేశారని టీడీపీ నాయకులు ఆరోపిస్తు్న్నారు. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో చెన్నుపాటి గాంధీ భార్య తొమ్మిదో డివిజన్ నుంచి గెలుపొందగా.. ఓడిపోయిన అభ్యర్థే దాడికి పాల్పడినట్లు టీడీపీ నాయకులు చెబుతున్నారు.
ఈ ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు. చెన్నుపాటి గాంధీపై దాడికి తెగబడింది వైఎస్సార్‌సీపీ ఫ్యాక్షన్ మూకలే అంటూ ఆరోపించారు. ఇంకెన్నాళ్లీ నెత్తుటి రాజకీయాలు చేస్తావు.. పోలీసుల సాయంతో రక్త చరిత్ర రాస్తున్నావంటూ ముఖ్యమంత్రి జగన్‌పై విమర్శలు చేశారు. ప్రతీ పేరూ రాసి పెట్టుకున్నామని.. తమ సహనాన్ని చేతకానితనంగా తీసుకోవద్దంటూ హెచ్చరించారు. మేము తిరిగి కొట్టే రోజున జగన్, పోలీసులు కనిపించరని.. దెబ్బకి దెబ్బ ఎలా ఉంటుందో చూపిస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. గాంధీపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు.