ఏపీ రాష్ట్ర పోలీసు యంత్రాంగంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా మండిపడ్డారు. టీడీపీ నాయకులపై రాష్ట్రంలో జరుగుతున్న దాడులను ఖండిస్తూ చంద్రబాబు నాయుడు ఏపీ డీజీపీకి లేఖ రాశారు. కుప్పం నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీతో పోలీసులు కుమ్మక్కయ్యారంటూ ఆయన ఆరోపించారు. కుప్పంలో పరిస్థితులు అంతా బాగానే ఉన్నాయని.. జరిగిన ఘటనలన్నీ సాధారణమేనంటూ డీజీపీ ప్రకటించడాన్ని ఆయన తప్పుబడుతూ చంద్రబాబు లేఖ రాశారు. టీడీపీ నుంచి ఎలాంటి ఫిర్యాదు రాలేదని చెప్పడం కూడా వాస్తవం కాదంటూ ఆయన లేఖలో పేర్కొన్నారు.
"పోలీసుల మధ్య సాధారణ దుస్తుల్లో ఉన్న వ్యక్తి టీడీపీ కార్యకర్త తల పగలగొడితే మీకు చిన్న విషయంగా అనిపిస్తోందా? పోలీసులే అకారణంగా ఫిర్యాదులు చేస్తుంటే న్యాయం ఎక్కడుంది? టీడీపీ నుంచి ఎలాంటి ఫిర్యాదు రాలేదనడం అవాస్తవం. బాధితులైన టీడీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదులపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేయలేదు. వైఎస్సార్‌సీపీ వారు ఇచ్చిన ఫిర్యాదుల్ని తీసుకుని టీడీపీ మద్దతుదారులపై 307 వంటి తీవ్రవైన సెక్షన్ల కింద కేసు పెట్టారు" అని చంద్రబాబు నాయుడు డీజీపీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.
విజయవాడలో మాజీ కార్పొరేటర్‌పై జరిగిన దాడిని కూడా చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. చెన్నుపాటి గాంధీపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు. దాడి కారణంగా గాంధీ కంటి చూపు పోయే ప్రమాదం ఉందనడంపై ఆవేదన వ్యక్తం చేసిన చంద్రబాబు, మెరుగైన వైద్యం చేయించాలంటూ పార్టీ నేతలను ఆదేశించారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి ఎలాంటి చర్యలు తీసుకుంటారో సమాధానం చెప్పాలంటూ ప్రశ్నించారు.