భారీ వర్షాల కారణంగా మొన్నటి వరకు నిండుకుండలా ఉన్న గుండ్లకమ్మ ప్రాజెక్టు నేడు ఖాళీ అయి రైతులకు ఆందోళన మిగిల్చింది. ప్రకాశం జిల్లాలో అగ్ర భాగానికి తాగు, సాగు నీరు అందించే మద్దిపాడు మండలంలోని గుండ్లకమ్మ జలాశయం ఖాళీ అయింది. మొన్నటి వరకు నిండుకుండలా ఉన్న జలాశయం.. ఇప్పుడు ఒక్కసారిగా ఖాళీ అయింది. జలాశయంలోని గేటు మరమ్మతుకు గురికావడమే దీనికి కారణం. ఫలితంగా 25 వేల క్యూసెక్కుల నీరు సముద్రం పాలైంది. ఖరీఫ్ సాగుతో పాటు 82 గ్రామాలకు తాగునీటికి అవసరమైన నీరంతా వృథాగా పోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు.
భారీ వర్షాలకు శ్రీశైలం, సాగర్ జలాశయాలు నిండుకుండలా మారడం అక్కడ నుంచి దిగువకు నీరు వదలడంతో గత నెల 31వ తేదీకి గుండ్లకమ్మ జలాశయానికి మూడు టీఎంసీల నీరు చేరింది. అయితే, ఇటీవల జలాశయంలోని మూడో గేటు దెబ్బ తినడంతో కొద్దికొద్దిగా నీరు పోతూ వస్తుంది. గేటు మరమ్మతు కోసం 13, 14, 15 గేట్లను ఎత్తి నీటిని కిందికి విడుదల చేశారు. అయినప్పటికీ మరమ్మతు చేయడం కుదరకపోవడంతో శనివారం 11, 12 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదలడంతో.. మూడు టీఎంసీల్లో ప్రస్తుతం కేవలం 0.516 టీఎంసీల నీళ్లే మిగిలాయి.
జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు నిన్న నేరుగా గుండ్లకమ్మ జలాశయాన్ని పరిశీలించి పనులు వేగవంతం కావాలని ఆదేశించారు. అయితే, నిన్న ఎంత ప్రయత్నించినా మరమ్మతు సాధ్యం కాకపోవడంతో ఇవాళ పనులు ప్రారంభిస్తామని అధికారులు చెప్పారు. దీనిపై మంత్రి స్పందిస్తూ.. గేటు మరమ్మతు కోసం రెండు టీఎంసీల నీరు దిగువకు వృథాగా వదలక తప్పట్లేదని విచారం వ్యక్తం చేశారు. త్వరలోనే మొత్తం పది గేట్ల పనులు పూర్తి చేస్తామన్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా నాగార్జున సాగర్ నుంచి నీటిని విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.