ఒక మనిషిని సరైన దిశలో తీర్చిదిద్దడం, ఒక మెరుగైన సమాజాన్ని తయారు చేయడంలో గురువుల పాత్ర వెలకట్టలేనిది. అందుకే మాతృ దేవోభవ, పితృ దేవోభవ, ఆచార్య దేవోభవ అంటూ తల్లిదండ్రులతో సమానంగా గురువును మనం పూజిస్తుంటాం. అజ్ఞానమనే చీకటిని తొలగిస్తారనే కారణంతో గురువులను కొవ్వొత్తులతో పోలుస్తుంటారు. తన జీవితం మొత్తాన్ని విద్యార్థుల ఉన్నతికే గురువులు వెచ్చిస్తుంటారు. భారతదేశంలో ఉపాధ్యాయుల దినోత్సవాన్ని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న జరుపుకుంటారు. ఉపాధ్యాయుడి స్థానం నుంచి రాష్ట్రపతిగా సర్వేపల్లి రాధాకృష్ణన్ ఎదిగిన తీరు స్పూర్తిదాయకం. ఉపాధ్యాయ దినోత్సవ విశిష్టతను తెలుసుకుందాం.
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని మనం ఉపాధ్యాయ దినోత్సవాన్ని ప్రతి ఏటా సెప్టెంబర్ 5న నిర్వహిస్తుంటాం. అతను ప్రఖ్యాత పండితుడు, భారతరత్న అవార్డు గ్రహీత, దేశానికి మొదటి ఉపరాష్ట్రపతి, స్వతంత్ర భారతదేశానికి రెండవ రాష్ట్రపతి. 1888 సెప్టెంబర్ 5న ఆయన జన్మించాడు. అతని తండ్రి పేరు సర్వేపల్లి వీరస్వామి మరియు తల్లి పేరు సర్వేపల్లి సీత. మద్రాసు క్రిస్టియన్ కళాశాల నుండి తమ డిగ్రీ, పీజీ పూర్తి చేశారు. తర్వాత ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించారు. ఆంధ్రా యూనివర్సిటీకి, బనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి వీసీగా పని చేశారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా పనిచేసిన మొదటి భారతీయుడు ఆయనే. 1975 ఏప్రిల్ 17న మరణించారు.
సర్వేపల్లి రాధాకృష్ణన్ 1962లో ఆయన రాష్ట్రపతి అయినప్పుడు, ఆయన జన్మదినాన్ని జరపడానికి విద్యార్థులు ఆసక్తి చూపారు. అయితే అందుకు బదులుగా సెప్టెంబర్ 5ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటే అది తనకు గర్వకారణమని ఆయన బదులిచ్చారు. దీంతో సెప్టెంబరు 5, 1962న మొదటి ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకున్నారు. 1967 నుంచి అధికారికంగా సెప్టెంబర్ 5ను ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం. భారత రాష్ట్రపతిగా, ఆయన తన జీతం రూ. 10,000లో కేవలం రూ. 2,500 మాత్రమే తీసుకునేవారు. మిగిలిన మొత్తాన్ని ప్రతి నెలా ప్రధానమంత్రి సహాయ నిధికి విరాళంగా ఇచ్చారు. ఉపాధ్యాయ వృత్తికే వన్నె తెచ్చిన వ్యక్తిగా ఆయన గురించి ఎంత చెప్పుకున్న తక్కువే అవుతుంది.
ఒక దేశం భవిష్యత్తు పిల్లల చేతుల్లో ఉంటే, వారిని ప్రయోజకులుగా మలిచేది మాత్రం నిస్సందేహంగా ఉపాధ్యాయులే. ఆదర్శవంతమైన పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు గురువులు తమ జీవితం ధారపోస్తారు. జ్ఞానం వల్ల అంధకారంలో ఉన్న లోకంలో వెలుగులు నింపేవారు గురువులే. మన విజయానికి ఉపాధ్యాయులే నిజమైన మూల స్తంభాలు. ఉపాధ్యాయులు ఎంత కష్టపడినా, గుర్తింపు కోసం తాపత్రయ పడరు. తమ వద్ద చదువుకున్న విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరుకుంటే అందరి కంటే ఎక్కువగా సంతోషించేది వారే. ఈ ప్రత్యేక దినోత్సవం విద్యార్థులకు మార్గనిర్దేశం చేయడం, విద్యావంతులను చేయడం ద్వారా దేశ నిర్మాణంలో ఉపాధ్యాయులు పోషించే కీలక పాత్రను గుర్తు చేస్తుంది. మన ఉన్నతికి శ్రమించి, మనలను తీర్చిదిద్దిన గురువులందరినీ ఈ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా స్మరించుకుందాం. గురువులందరికీ మరోసారి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.