మానవాళికి తెలిసిన పురాతన మూలికలలో తులసి ఒకటి. నిత్యం ఇంటి పెరట్లో మహిళల పూజలందుకుంటోంది. అయితే దీనిలో ఎన్నో ఔషధ గుణాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలను ఇది దూరం చేస్తుందని పేర్కొన్నారు. జీర్ణాశయ సమస్యలను దూరం చేయడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచే గుణం తులసి ఆకులకు ఉంది. తులసి జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. నాడీ వ్యవస్థను బలపరుస్తుంది. తలనొప్పి మరియు నిద్రలేమికి మంచి ఔషధంగా ఉంటుంది. తులసి ఆకులలో ఉండే యూజినాల్ జీర్ణవ్యవస్థలో సమస్యలను పోగొడుతుంది. శరీరంలో ఉండే వివిధ ఎంజైములను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది.
తులసి ఆకులలో ఉండే యూజీనాల్, సిట్రోనెలోల్, లినాలూల్‌తో సహా శక్తివంతమైన నూనెలు గుండె జబ్బులు, రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను దూరం చేస్తాయి. తులసి ఆకులను తీసుకోవడం వల్ల జ్వరం, తలనొప్పి, గొంతునొప్పి, జలుబు, దగ్గు, ఫ్లూ వంటివి కూడా తగ్గుతాయి. ఇందులో ఉండే సహజ యాంటీఆక్సిడెంట్ల వల్ల ఫ్రీ రాడికల్స్ దెబ్బతినకుండా శరీర కణజాలాలను రక్షించడంలో సహాయపడుతుంది. జిడ్డు చర్మం ఉన్నవారిలో మలినాలను బయటకు పంపి, మేని నిగారింపును అందిస్తుంది. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు, రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలు ఒత్తిడిని కూడా నియంత్రించడంలో దోహదపడతాయి