కడప జిల్లా వాసులకు మన కడప అనే పేరిట యాత్రా సౌకర్యాన్ని కల్పించాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. వైఎస్ఆర్ జిల్లా ప్రజలకు ప్రముఖ ప్రాంతాల సందర్శనకు మన కడప పేరుతో ప్రాచీన ప్రదేశాల సందర్శన కార్యక్రమానికి ఈ నెల 10వ తేది నుండి శ్రీకారం చుట్టడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ వి. విజయ్ రామరాజు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రముఖ దర్శనీయ స్థలాలను సందర్శించేందుకు ప్యాకేజీ సౌకర్యాన్ని కల్పిస్తున్నామన్నారు. 40 సీట్లు కెపాసిటి గల ఏపిఎస్ఆర్టిసి ఎయిర్ కండిషన్ ఇంద్ర బస్ సర్వీసును ఏర్పాటు చేశామన్నారు. ప్రతి నెల ఆదివారాలతో పాటు రెండవ శనివారం కూడా ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. ముందుగా ఈ నెల 10వ తేదిన స్థానిక ఆల్ ఇండియా రేడియో స్టేషన్ ఎదురుగా ఉన్న హరిత హోటల్ నుండి ఉదయం 7. 00 గం. లకు ఎయిర్ కండిషన్ బస్సు బయలుదేరుతుందన్నారు. పెద్దలకు రూ. 500 లు, 6 నుండి 12 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు రూ. 300 లు మాత్రమే యాత్రా రుసుముగా నిర్ణయించామన్నారు. టూరిజం హరితా హోటల్ నందు ప్రతిరోజూ ఉదయం 8. ౦౦ గం. ల నుండి రాత్రి 9. ౦౦ గం. ల వరకు డబ్బులు చెల్లించి టికెట్లు పొందవచ్చునన్నారు.
హరిత హోటల్ నుండి ప్రారంభం అయ్యే. ఈ యాత్రా ప్యాకేజీలో సందర్శకులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, టీ సౌకర్యం కల్పిస్తామన్నారు. బస్సులో ఒక గైడ్ అందుబాటులో ఉంటూ ఆయా దర్శనీయ స్థలాల విశేషాలని, ప్రాముఖ్యతను క్షుణ్ణంగా వివరిస్తారన్నారు. ముందుగా దేవునికడప తరువాత పుష్పగిరి కామాక్షి సహిత వైద్యనాదేశ్వరుని దర్శనం తో పాటు పెన్నా నదీ సోయగాలు తిలకించవచ్చు. అక్కడి నుండి బయలుదేరి ఒంటిమిట్ట కోదండ రామస్వామిని దర్శిస్తారు. ఈ ఆలయంలో తిరుమల శ్రీవారి లడ్డును అందుబాటులో ఉంచుతామని యాత్రికులు కొనుగోలు చేసుకోవచ్చునన్నారు.
ఒంటిమిట్ట కోదండ రామ స్వామి వారి దర్శనానంతరం అక్కడే ఉన్న టూరిజం హోటల్ నందు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశామన్నారు. భోజనానంతరం అరగంట విశ్రాంతి తీసుకున్న తర్వాత సిద్ధవటం కోటకు బస్సు బయలుదేరుతుందన్నారు. కోటలోని అన్ని విశేషాలను చూడవచ్చు, దర్శనానంతరం స్నాక్స్ , టీ అందించి సాయంత్రం 5. 30 గం. లలోపు తిరిగి కడప టూరిజం హరిత హోటల్ కు చేరుకోవడంతో ఈ యాత్ర ముగుస్తుందన్నారు.
ఒక్క రోజులో దాదాపు 120 కి. మీల ప్రయాణానికి ఎలాంటి లాభాపేక్ష లేకుండా జిల్లా వాసులకు అతి తక్కువ రుసుముతో ప్యాకేజి ద్వారా మన కడప సౌకర్యాన్ని కల్పించడం జరుగుతుందన్నారు. కడప జిల్లా నందలి ప్రాచీన ప్రదేశాలను జిల్లా వాసులకు దర్శింపచేయుట ద్వారా నేటి తరానికి మన వారసత్వ సంపదను గుర్తుచేయాలన్నదే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టరు ఆ ప్రకటనలో పిలుపునిచ్చారు.