అన్నమయ్య జిల్లాలో జాతీయ రహదారుల నిర్మాణాలకు అవసరమైన భూ సేకరణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ గిరీష మంగళవారం రాయచోటి లోని కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లో సోమవారం ఆయన జేసీ తమీమ్ అన్సారియాతో కలిసి అధికారులతో సమీక్షించారు. మదనపల్లె పీలేరు జాతీయ రహదారి నిర్మాణానికి సంబంధించి 455. 18 ఎకరాలు సేకరించాల్సి ఉందన్నారు. ఇప్పటివరకు సర్వే సంఖ్య 676 లో 172. 683 ఎకరాలు సేకరించామని అధికారులు తెలిపారు. మంగంపేట ఖనిజాభివృద్ధి సంస్థకు సంబంధించిన భూ సేకరణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
పునరావాసం కింద ఎన్ని కోట్లు ఖర్చు చేశారో నివేదించాలన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలన పూర్తి చేసి బాధితుల జాబితాలు సిద్ధం చేయాలని, బాధిత కుటుంబాలు పునరావాస కేంద్రాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఓబులవారిపల్లె మండలంలో భూ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తహసీల్దారు పీర్ మున్నీని ఆదేశించారు. ఆయా సమావేశాల్లో ఎన్హెచ్ఎఐ పీడీ హరికృష్ణ, రాయచోటి, మదనపల్లె, రాజంపేట ఆర్డీవోలు రంగస్వామి, మురళీ, కోదండరామిరెడ్డి, ఏపీఎండీసీ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.