ఆసియా కప్ -2022లో సూపర్-4 దశలో బుధవారం రాత్రి షార్జాలో జరిగిన అఫ్గాన్-పాక్ మ్యాచ్ చివరిఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగింది. లో స్కోరింగ్ థ్రిల్లర్ గా మారిన ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ బౌలర్ నసీమ్ షా చివరి ఓవర్ లో రెండు భారీ సిక్సర్లు బాది పాక్ కు అనూహ్య విజయాన్ని అందించాడు. అయితే ఈ మ్యాచ్ లో పాక్ బ్యాటర్ అసిఫ్ అలీ చేసిన అతి పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలీ.. ఫరీద్ అహ్మద్ బౌలింగ్ లో అవుటై పెవిలియన్ వెళ్తుండగా బౌలర్ తో గొడవకు దిగాడు. బ్యాట్ తీసుకోని కొట్టబోయాడు.
అసలేం జరిగిందంటే.. పాకిస్తాన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 19వ ఓవర్ వేసిన అఫ్గాన్ బౌలర్ ఫరీద్ అహ్మద్ బౌలింగ్ లో నాలుగో బంతికి అలీ సిక్సర్ బాదాడు. అయితే ఆ తర్వాత బంతికే అతడు భారీ షాట్ కు యత్నించి క్యాచ్ అవుట్ అయ్యాడు.
అలీ అవుటయ్యాక ఫరీద్ తో పాటు అఫ్గాన్ ఆటగాళ్లు సంబురాలు చేసుకున్నారు. అయితే ఫరీద్.. అలీకి కాస్త దగ్గరగా వెళ్లి వికెట్ తీసిన మూమెంట్ ను ఎంజాయ్ చేశాడు. కానీ అది అలీకి నచ్చలేదు. దీంతో వెంటనే అలీ.. ఫరీద్ దగ్గరికి వెళ్లి వాగ్వాదానికి దిగాడు. ఫరీద్ కూడా వెనక్కి తగ్గలేదు. అక్కడితో అలీ ఆగక తన చేతిలో ఉన్న బ్యాట్ తీసి ఫరీద్ ను కొట్టబోయాడు. ఫరీద్ కూడా ‘చూస్కుందాం రా..’ అన్నట్టుగానే ముందుకు కదిలాడు. కానీ అప్పటికే అప్గాన్ ఫీల్డర్లు అక్కడికి చేరి ఇద్దరినీ విడదీశారు. దీంతో గొడవ అక్కడికి సద్ధుమణిగింది.
ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నది. అసిఫ్ అలీ అతి చేశాడని నెటిజనులు వాపోతున్నారు. వికెట్ తీశాక బౌలర్ సెలబ్రేట్ చేసుకోవడం కామనే అని.. అంత మాత్రానాకే అలీ అంతలా రియాక్ట్ అవసరం లేదని అంటున్నారు.
చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన అప్గానిస్తాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ తడబడింది. చివర్లో నసీమ్ షా ఆఖరి ఓవర్లో రెండు భారీ సిక్సర్లు బాది పాక్ కు అనూహ్య విజయాన్ని అందించాడు. పలితంగా పాక్ ఫైనల్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది. భారత్ కథ ముగిసింది.