సంప్రదాయాలను పాటిస్తూ, శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరాన్ని గతం కంటే మిన్నగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని, అధికారులను రాష్ట్ర విద్యాశాఖా మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశించారు. వీటితోపాటుగా విజయనగరం వైభవాన్ని చాటిచెప్పే విధంగా, విజయనగరం ఉత్సవాలను నిర్వహించాలని సూచించారు. అక్టోబరు 10, 11 తేదీల్లో జరిగే పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరాలు, అక్టోబరు 9, 10, 11 తేదీల్లో నిర్వహించే విజయనగరం ఉత్సవాలపై, ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రముఖులు, వివిధ సంస్థల ప్రతినిధులతో కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ విజయనగరం ఉత్సవాలు, పైడితల్లి సిరిమానోత్సవానికి సమిష్టిగా విజయవంతం చేయాలని, దీనికి పటిష్టమైన కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ఈ ఏడాది సామాన్య భక్తులను అనుమతించాలని ఆదేశించారు. చాలా కాలంగా విజయనగరం ఉత్సవాలు, సిరిమానోత్సవంలో ఒక భాగంగానే జరుగుతున్నాయని చెప్పారు. అక్టోబరు 9, 10, 11 తేదీల్లో జరిగే విజయనగరం ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు తగిన ప్రణాళికను రూపొందించాలన్నారు. సైన్స్‌ఫెయిర్, ఫ్లవర్ షోలతోపాటు, సాంస్కృతిక ప్రదర్శనలను ఏర్పాటు చేయాలన్నారు. అక్టోబరు 10, 11 తేదీల్లో జరిగే పైడితల్లి సిరిమాను సంబరానికి అత్యంత పకడ్భందీగా ఏర్పాట్లు చేయాలని, భక్తులు ఎక్కడా ఇబ్బంది పడకుండా చూడాలని ఆదేశించారు.
భక్తులపట్ల దురుసుగా ప్రవర్తించవద్దని పోలీసులకు సూచించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకొనేందుకు సర్వ దర్శనంతోపాటుగా, రూ. 100, రూ. 300 క్యూలైన్లను కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ ఏడాది కూడా విఐపి పాసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. పట్టణంలో పారిశుధ్యం, త్రాగునీటి సరఫరా, విద్యుత్ సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. పట్టణాన్ని సుందరంగా అలంకరించాలని, రంగురంగుల విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో స్థానిక కళాకారులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అమ్మవారి పండుగ అందరి ఇళ్లలో జరిగే పండుగ అని, భక్తుల మనోభిప్రాయాలను గౌరవిస్తూ, సంప్రదాయ బద్దంగా, అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేయాలని మంత్రి బొత్స కోరారు.