క్షణికావేశంలో యువతీ యువకులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని దళిత జెఎసి నేతలు కంఠ వేణు, యజ్జల గురుమూర్తి, తైక్వాండో శ్రీనులు సూచించారు. తల్లితండ్రులు కుటుంబ సభ్యులు పెట్టుకున్న ఆశలను నెరవేర్చేదిశగా విద్యార్ధిని, విద్యార్ధులు కృషి చేయాలే తప్పా అధైర్యపడి తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదని హితవుపలికారు. శ్రీకాకుళం నగరంలోని ఎన్ జిఓ హోం శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని వారు యువతీయువకులకి తమ వంతు బాధ్యతగా సూచనలు చేసారు.
ఈ సందర్భంగా కంఠ వేణు, యజ్జల గురుమూర్తి, తైక్వాండో శ్రీనులు మాట్లాడుతూ ఈ పోటీ ప్రపంచంలో విద్యార్ధిని, విద్యార్ధులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలన్నారు. ఒత్తిడిలకి లోనై బలవన్మరణాలకు పాల్పడి విలువైన జీవితాన్ని నాశనం చేసుకుని కన్న వారికి బాధను మిగల్చవద్దన్నారు. తల్లితండ్రులు కూడా విద్యార్ధిని, విద్యార్ధులపై ఒత్తిడి తీసుకురావద్దని సూచించారు. జిల్లాలోని ఇటీవల వివిద విద్యా సంస్థలలో చదవుతున్న విద్యార్ధినులు ఆత్మహత్యలకి పాల్పడి మృతి చెందిన సంఘటనలు కన్నవారిని వేదనకి గురిచేసిన విషయాన్ని గుర్తు చేసారు. అటువంటి దుశ్సాహసాలకు విద్యార్ధిని విద్యార్ధులు పాల్పడవద్దని కోరారు.
ఏదైనా సమస్యలు ఉన్నా ఇబ్బందులు ఎదురైనా సహచరులో ఉపాధ్యాయులకో, కుటుంబ సభ్యులకో తెలియజేస్తా వారే వాటిని పరిష్కరించే చర్యలు తీసుకుంటారన్నారు. జిల్లాలో సాంఘిక, గిరిజన సంక్షేమ పాఠశాలలు, కళాశాలలో చదువుతున్న విద్యార్ధిని, విద్యార్ధులతో పాటు కార్పోరేట్ , ప్రోఫెషనల్ కళాశాలల్లో చదువుతున్న వారు కూడా ఏ విషయానికి అధైర్యపడవద్దని, బలవన్మరణం అనేది సమస్యకి పరిష్కారం కాదని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలన్నారు.
దళిత జెఎసి తరపున సాంఘిక సంక్షేమ, గురుకుల పాఠశాలలు, కళాశాలలు విద్యార్ధులకి వ్యక్తిత్వ వికాస నిపుణులతో కౌన్సిలింగ్ ఇప్పించేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు. వారికి అన్ని విదాలుగా అండగా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. విద్యాశాఖ అధికారులు కూడా విద్యార్ధిని, విద్యార్ధులకు ప్రత్యేకంగా కౌన్సిలింగ్ ఇవ్వాడానికి ప్రాధాన్యతను ఇవ్వాలని సూచించారు.
అలాగే విద్యార్ధిని విద్యార్ధులు ఒత్తిడిని అధిగమించేలా వారికి మానసిక ఉల్లాసాన్ని కలిగించేలా కార్యక్రమాలను పాఠశాలలు, కళాశాలల్లో నిర్వహించేలా చూడాలన్నారు. యోగాతో పాటు ఆటలు వారి దిన చర్యలో భాగం చేసి భవిష్యత్ లో వారు ఉన్నత శిఖరాలకు చేరుకునేలా కృషి చేయాలని దళిత జెఎసి నేతలు కంఠ వేణు, యజ్జల గురుమూర్తి, తైక్వాండో శ్రీనులు అధికారులను, జిల్లా యంత్రాంగాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో దళిత జెఎసి నాయకులు పెయ్యల చంటి, కుమిలి రాజేష్, చిత్తిరి రమేష్ లండ అప్పన్న, సాకేటి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.