రాహుల్ గాంధీకి పార్టీని నడిపించేంత సామర్థ్యం లేదని గులాంనబీ ఆజాద్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తన రాజీనామాతో కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చిన జమ్మూకశ్మీర్ నేత గులాంనబీ ఆజాద్.. కొత్త పార్టీపై పది రోజుల్లో ప్రకటన చేస్తానన్నారు. 73 ఏళ్ల ఆజాద్ ఐదు దశాబ్దాల రాజకీయ కెరీర్ కాంగ్రెస్ తోనే కొనసాగగా.. కాంగ్రెస్ కు ఇక భవిష్యత్తు లేదంటూ తీవ్ర విమర్శలతో ఆయన రాజీనామా చేయడం తెలిసిందే. రాహుల్ గాంధీకి పార్టీని నడిపించేంత సామర్థ్యం లేదని, కాంగ్రెస్ ఇక ఎప్పటికీ కోలుకోలేని స్థాయికి పడిపోయిందంటూ ఆయన ఘాటైన వ్యాఖ్యలు కూడా చేశారు.
జమ్మూలో బహిరంగ సభను తలపెట్టిన ఆజాద్ ఆదివారం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత తనకు మద్దతిచ్చేవారు ఎన్నో రెట్లు పెరిగినట్టు ప్రకటించారు. పార్టీలతో సంబంధం లేకుండా ఆజాద్ కు మంచి మద్దతు లభిస్తున్న క్రమంలో ఆయన ఇలా వ్యాఖ్యానించారు. జమ్మూలో 30-35 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 400 మందిని కలుసుకున్నట్టు చెప్పారు. వారంతా తనకు మద్దతు తెలిపారని, ఏ పార్టీ అయినా తనతో నడుస్తానని చెప్పినట్టు పేర్కొన్నారు.