బ్రిటన్ లో ప్రజాస్వామ్య ప్రభుత్వమున్నా అక్కడ రాచరిక వ్యవస్థ కూడా అమలులో ఉంది. రెండు జోడెద్దులా ముందుకు సాగుతున్నాయి. దీనికి కారణాలు లేకపోలేదు. బ్రిటన్ రాణి ఎలిజబెత్-II మరణించారు. దీంతో ఎలిజబెత్ స్థానంలో బ్రిటన్ రాజుగా ఆమె కుమారుడు ఛార్లెస్ బాధ్యతలు చేపట్టడం లాంఛనమే. 70 ఏళ్లకుపైగా బ్రిటన్ రాణిగా వ్యవహరించిన ఎలిజబెత్ మరణంతో.. ఆ దేశ ప్రజలు విషాదంలో మునిగిపోయారు. ఎలిజబెత్ అంత్యక్రియలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హాజరు కానున్నారు. కాగా బ్రిటన్ వలస పాలన నుంచి విముక్తి పొందిన చాలా దేశాలు స్వాతంత్య్రం వచ్చాక ప్రజాస్వామ్య దేశాలుగా మారాయి. కానీ ప్రజాస్వామ్య దేశమైనప్పటికీ ఇప్పటికీ బ్రిటన్లో రాచరికం అమల్లో ఉండటం ఆశ్చర్యం కలిగించక మానదు. ఇంతకూ బ్రిటన్‌లో రాచరికం ఇంకా ఎందుకు అమల్లో ఉందంటే..
రవి అస్తమించిన సామ్రాజ్యంగా పేరొందిన బ్రిటన్‌లో రాచరికం రాజ్యాంగబద్ధం. ఆ దేశ ప్రధాని దగ్గర వాస్తవ అధికారాలు ఉంటే.. రాణి లేదా రాజు దగ్గర నామమాత్ర అధికారాలు మాత్రమే ఉంటాయి. రాణి లేదా రాజును రాజ్యాధినేతగా పరిగణిస్తూ.. పార్లమెంట్ నిర్ణయాలు తీసుకుంటుంది.
వందల ఏళ్ల క్రితం బ్రిటన్‌లో రాజు లేదా రాణి మాటే వేదవాక్కు. మన దేశంలో రాజుల మాటకు ఎలా ఎదురు లేదో.. అక్కడా అంతే. ఇప్పటికీ అక్కడ రాజు లేదా రాణి రాజ్యాధినేత. కానీ ఇప్పుడు బ్రిటన్ రాణి లేదా రాజు అంటే అది గౌరవ పదవి మాత్రమే. రాజకీయాల్లో రాజు లేదా రాణి చురుకైన పాత్ర పోషించరు. మన దగ్గర రాష్ట్రపతి ఎలాగో.. బ్రిటన్ రాణి పదవి కూడా అలాంటిదే.
క్వీన్ ఎలిజబెత్-II 1952లో రాణిగా సింహాసనాన్ని అధిష్టించి.. సుదీర్ఘ కాలం బ్రిటన్‌ను పాలించారు. కానీ ఆమె పట్ల ప్రజల్లో ఎక్కడా వ్యతిరేకత కనిపించలేదు. తన పట్ల బ్రిటన్ ప్రజల్లో గౌరవభావం ఏమాత్రం తగ్గకుండా ఆమె హుందాగా వ్యవహరించారు. బ్రిటన్ రాజకుటుంబం అనేది ఆ దేశానికి ఓ సింబల్ మాత్రమే కాదు.. మిగతా దేశాల్లో నటులు, సంగీత దర్శకులు, క్రీడాకారులను ఎలాగైతే సెలబ్రెటీలుగా చూస్తారో.. బ్రిటిష్ ప్రజలు రాజకుటుంబీకులను కూడా అలాగే చూస్తారు. రాజకుటుంబీకులు జీవితాల గురించి తెలుసుకోవడానికి అమితాసక్తి కనబరుస్తారు.
బ్రిటన్ వాసులు తాము పన్నుగా చెల్లించిన డబ్బులతో రాజకుటుంబం బాగోగులు చూసుకోవడానికి ఏ మాత్రం ఇబ్బంది పడటం లేదు. ఇప్పటికీ రాచరికాన్ని బ్రిటన్ వాసులు తమ ప్రత్యేకతగా భావిస్తుంటారు. 2020లో యూగవ్.కామ్ నిర్వహించిన పోల్‌లో 80 శాతం మంది బ్రిటన్ వాసులు తమ రాణికి అనుకూలంగా ఓటేశారు. మరో పోల్‌లో 76 శాతం మంది బ్రిటన్ వాసులు రాచరికానికి అనుకూలంగా ఓటేశారు. బ్రిటన్ రాయల్ ఫ్యామిలీ కారణంగా యూకేకు వచ్చే పర్యాటకులు కూడా పెద్ద మొత్తంలోనే ఉన్నారు. హ్యారీ, మెగాన్ పెళ్లి సందర్భంగా లండన్ వెళ్లిన పర్యాటకులు వంద బిలియన్ డాలర్లకుపైగా ఖర్చు చేశారని అంచనా.