బ్రిటన్ లో నూతన ప్రభుత్వంతోపాటు తాజాగా క్వీన్ ఎలిజబెత్-2 మరణంతో ఆ దేశానికి కొత్త రాజు కూడా వచ్చారు. క్వీన్ ఎలిజబెత్-2 మరణంతో బ్రిటన్ చరిత్రలో ఓ శకం ముగిసి.. కొత్త శకం మొదలైంది. ఆమె పెద్ద కుమారుడు, వేల్స్ యువరాజు ఛార్లెస్-3ని కొత్త రాజుగా అధికారికంగా ప్రకటించారు. చారిత్రక సెయింట్ జేమ్స్ ప్యాలెస్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ ప్రకటన చేశారు. అనంతరం సంబంధిత డాక్యుమెంట్‌పై ఆయన సంతకం చేశారు. దానిపై బ్రిటన్ ప్రధాని, కాంటర్‌బరీ ఆర్చిబిషప్, లార్డ్ ఛాన్స్‌లర్, పలువురు సీనియర్లు కూడా సంతకాలు చేశారు.
ఛార్లెస్ భార్య క్వీన్ కాన్సర్ట్ కెమిల్లా, వారి కుమారుడు ప్రిన్స్ విలియమ్ సహా అతి కొద్దిమంది అతిథుల సమక్షంలో రాజుగా ఛార్లెస్ (73)ను ప్రకటించారు. అంతకుముందు సీనియర్ మంత్రులు, జడ్జ్‌లు, మతపెద్దలు సమావేశమయ్యారు. ఆ భేటీలో కొత్త రాజును నిర్ణయించారు. అనంతరం అధికారికంగా ప్రకటించారు. రాజుగా ప్రమాణం చేసిన కింగ్ ఛార్లెస్ తన తల్లి మరణంపై భావోద్వేగంగా ప్రసంగించారు. ఆమె బ్రిటన్‌కు అందించిన సేవలను కొనియాడారు. దేశాన్ని అంకిత భావంతో పాలించిందన్నారు. జీవిత కాలం ప్రేమను పంచాలని, నిస్వార్థ సేవ చేయాలని తన తల్లి తనకు నేర్పించందన్నారు. ఇది చాలా విషాదకరమైన సమయమే కానీ.. ఆమె విశ్వసనీయమైన జీవితానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు కింగ్ ఛార్లెస్ తెలిపారు.
అయితే ఛార్లెస్‌ను రాజుగా ప్రకటించినప్పటికీ.. ఆయన పట్టాభిషేకానికి సమయం పట్టేట్టు తెలుస్తుంది. ఆ ప్రక్రియకు అనుసరించే విధానమే కారణమని బకింగ్ హామ్ ప్యాలెస్ వెల్లడించింది. దీనికి ఏడాది కాలం పట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. గతంలో కూడా ఇలా జరిగింది. క్వీన్ ఎలిజబెత్‌ను 1952లో రాణిగా ప్రకటించగా.. 1953లో ఆమెకు పట్టాభిషేకం జరిగింది. 900 ఏళ్లుగా పట్టాభిషేక మహోత్సవం జరుగుతున్న వెస్ట్‌మినిస్టర్ అబేలోనే.. ఈసారి ఛార్లెస్ ప్రమాణ స్వీకారం జరగనుంది.