ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అటు స్నేహాస్తం అందిస్తూనే...ఇటు శత్రువు పాకిస్తాన్ కు అమెరికా సహకారం

international |  Suryaa Desk  | Published : Sun, Sep 11, 2022, 11:41 PM

భారత్ తో దోస్తీకి స్నేహాస్తం అందిస్తూనే మరోవైపు పాకిస్తాన్ కు అంతర్గతంగా సహకారం అందిస్తూ అమెరికా తన వక్రీ బుద్దీని బయటపెట్టుకుంటోంది. ఇలా అగ్రరాజ్యం అమెరికా మరోసారి తన బుద్ధి బయటపెట్టింది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో తన ప్రయోజనాల కోసం, చైనాను కౌంటర్ చేయడం కోసం భారత్‌తో దోస్తీ చేస్తున్న అమెరికా.. పాకిస్థాన్‌కు భారీ సైనిక సాయం అందించాలని నిర్ణయించింది. ఎఫ్-16 ఫైటర్ జెట్లను అప్‌గ్రేడ్ చేయడం కోసం పాకిస్థాన్‌కు 450 మిలియన్ డాలర్ల విలువైన మిలటరీ ప్యాకేజీని అందజేయడానికి బైడెన్ సర్కారు ఆమోదం తెలిపింది. అమెరికా ఇచ్చే సాయంతో పాకిస్థాన్ తన దగ్గరున్న మూడు స్క్వాడ్రన్‌లలోని 65 ఎఫ్-16 ఫైటర్ జెట్లను ఆధునికీకరించగలదు.


వాస్తవానికి 2018లో డొనాల్డ్ ట్రంప్ సర్కారు పాకిస్థాన్‌కు సైనిక సాయాన్ని నిలిపేస్తూ నిర్ణయం తీసుకుంది. ఉగ్రవాద సంస్థల పట్ల చర్యలు తీసుకోవడంలో పాక్ ఉదాసీన వైఖరి కనబరుస్తుండటంతో ట్రంప్ ఈ రకంగా ఇస్లామాబాద్‌కు షాకిచ్చారు. కానీ తాజాగా బైడెన్ అందుకు విరుద్ధమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంలో అమెరికా తీరుపట్ల భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది.


2019 ఫిబ్రవరిలో పాకిస్థాన్ 24 ఫైటర్ జెట్లను భారత్‌వైపు మళ్లించగా.. అందులో 10 ఎఫ్-16 ఫైటర్లు కూడా ఉన్నాయి. మిగ్-21లో ప్రయాణించిన వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ డాగ్ ఫైట్ ద్వారా ఎఫ్-16 యుద్ధ విమానాన్ని నేలకూల్చిన సంగతి తెలిసిందే. దీన్ని బట్టి ఇప్పటికీ పాకిస్థాన్ ఎఫ్-16 యుద్ధ విమానాల ప్రధాన టార్గెట్ భారత్ అని చెప్పొచ్చు.


పాక్ దగ్గరున్న ఎఫ్-16 యుద్ధ విమానాల్లో చాలా వరకు పాతవి, కొన్ని సరిగా పనిచేయడం లేదు. చైనాతో పాకిస్థాన్ అంటకాగుతున్న పరిస్థితుల్లోనూ ఆ దేశానికి అమెరికా సాయం అందించాలని నిర్ణయించడం వెనుక క్విడ్ ప్రొ క్వో ఒప్పందం ఉందని భావిస్తున్నారు. కాబుల్‌లోని ఓ ఇంట్లో ఉన్న అల్‌ఖైదా చీఫ్ అల్ జవహరీని జూలై 31న అమెరికా డ్రోన్‌తో దాడి చేసి హతమార్చిన సంగతి తెలిసిందే. జవహరీ కాబుల్‌లో ఉన్న విషయాన్ని పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్ఐ ముందుగా నిర్థారించి.. ఆ సమాచారాన్ని సీఐఏకు అందజేసిందని.. దీనికి ప్రతిఫలంగా బైడెన్ సర్కారు ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని రివర్స్ చేశారనే ప్రచారం జరుగుతోంది.


పాకిస్థాన్‌కు మిలటరీ సాయం అందించాలని బైడెన్ సర్కారు తీసుకున్న నిర్ణయం పట్ల భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. అమెరికాతో 2+2 ఇంటర్‌సెషనల్ మీటింగ్, తీరప్రాంత రక్షణపై మన దేశంలో చర్చలు జరుపుతున్న సమయంలో.. దక్షిణ మరియు మధ్య ఆసియా వ్యవహారాలను చూసే డొనాల్డ్ లూ ముందు భారత్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అమెరికా నిర్ణయం తమ భద్రతపై ప్రభావం చూపుతుందని ఇండియా ఆందోళన వ్యక్తం చేసింది.


ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ఖండించే విషయంలో భారత్ తమతో చేతులు కలపాలని పశ్చిమ దేశాలు కోరుకుంటున్నాయి. కానీ భారత్ మాత్రం తటస్థ వైఖరిని కనబర్చింది. అంతే కాకుండా రష్యా నుంచి ముడి చమురు దిగుమతులను పెంచింది. ఇది అమెరికాకు నచ్చలేదు. అంతకు ముందు అమెరికాకు హెచ్చరికలను పట్టించుకోకుండా.. రష్యా నుంచి భారత్ ఎస్-400 మిస్సైల్ డిఫెన్స్ వ్యవస్థను భారత్ దిగుమతి చేసుకుంది. ఈ నేపథ్యంలోనే అమెరికా పాకిస్థాన్‌కు సైనిక సాయం అందించాలని నిర్ణయించి ఉంటుందని భావిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com