ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ పదవికి వైసీపీ విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి శుక్రవారం నామినేషన్ వేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి అయిన అసెంబ్లీ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులకు ఆయన నామినేషన్ పత్రాలను అందజేశారు. నామినేషన్ దాఖలు చేసే సమయంలో కోలగట్ల వెంట బీసీ సంక్షేమం, పౌర సంబంధాల శాఖ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, చీఫ్‌విప్ ముదునూరి ప్రసాదరాజు, ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాస్, పుష్పశ్రీవాణి, శంబంగి చిన్నప్పలనాయుడు తదితరులున్నారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం కోలగట్ల స్పీకర్ తమ్మినేని సీతారాంను మర్యాదపూర్వకంగా కలిశారు. గడువు ముగిసే సమయానికి కోలగట్ల మినహా ఎవరూ నామినేషన్ దాఖలు చేయలేదు. ఈ నేపథ్యంలో కోలగట్ల వీరభద్రస్వామి డిప్యూటీ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు స్పీకర్ తమ్మినేని సోమవారం లాంఛనంగా ప్రకటించనున్నారు.
డిప్యూటీ స్పీకర్ పదవికి కోన రఘుపతి గురువారం రాజీనామా చేయడంతో ఆ పదవికి ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్‌ను శాసనసభలో శుక్రవారం స్పీకర్ ప్రకటించారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలవరకు నామినేషన్‌లు దాఖలు చేయడానికి గడువుగా తెలిపారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభలో ఎన్నిక నిర్వహిస్తామని ఆ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.