లెజెండ్స్ లీగ్ టీ20 టోర్నీలో భాగంగా వరల్డ్ జెయింట్స్‌తో జరిగిన ఛారిటీ మ్యాచ్‌లో హర్భజన్ సింగ్ నేతృత్వంలోని ఇండియా మహారాజాస్ విజయం సాధించింది. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో సమిష్టిగా రాణించిన భారత్ 6 వికెట్ల తేడాతో ప్రపంచ దిగ్గజాలను ఓడించింది. పంకజ్ సింగ్ బౌలింగ్‌లో అద్భుతంగా రాణించగా, పఠాన్ సోదరులు బ్యాటింగ్‌లో అద్భుతంగా రాణించారు. ఈ మ్యాచ్ నేపథ్యంలో కోల్‌కతా మైదానం దద్దరిల్లింది. వివిధ రకాల లేజర్ లైట్లతో పాటు, మొబైల్ ఫ్లాష్‌లైట్లను అభిమానులు ఆన్ చేశారు. రెహమాన్ పాడిన 'వందేమాతరం' బ్యాక్ గ్రౌండ్ ప్లే అయింది. ఇది చూసిన ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వరల్డ్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 170 పరుగులు చేసింది. కెవిన్ ఓబ్రెయిన్ (31 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్ తో 52) హాఫ్ సెంచరీతో రాణించినా.. దినేష్ రామ్ దిన్ (29 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్ తో 42 నాటౌట్ ) చెలరేగి ఆడాడు. భారత మహారాజాస్ బౌలర్లలో పంకజ్ సింగ్ (5/26) ఐదు వికెట్లు పడగొట్టాడు. హర్భజన్ సింగ్, జోగిందర్ శర్మ, మహ్మద్ కైఫ్ ఒక్కో వికెట్ తీశారు. మూడు ఓవర్లలో శ్రీశాంత్ 46 పరుగులు చేశాడు. ముఖ్యంగా తన 19వ ఓవర్లో రామ్దిన్ ఐదు బౌండరీలతో 22 పరుగులు చేశాడు. అనంతరం ఇండియా మహారాజాస్ 18.4 ఓవర్లలో 4 వికెట్లకు 175 పరుగులు చేసి సునాయాస విజయాన్ని అందుకుంది. టిమ్ బ్రెస్నన్ (3/21) భారత్ 50 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. సెహ్వాగ్ (4), పార్థివ్ పటేల్ (18), మహ్మద్ కైఫ్ (11) ఘోరంగా విఫలమయ్యారు. కానీ తన్మయ్ శ్రీవాస్తవ (39 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్సర్ తో 54), యూసుఫ్ పఠాన్ (35 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 50 నాటౌట్), ఇర్ఫాన్ పఠాన్ (9 బంతుల్లో 3 సిక్సర్లతో 20 నాటౌట్) చెలరేగిపోయారు. ప్రపంచ దిగ్గజం బౌలర్లలో టిమ్ బ్రెస్నన్ ఒక్కడే మూడు వికెట్లు పడగొట్టగా.. ఫిడెల్ ఎడ్వర్డ్స్ ఒక వికెట్ తీశాడు.